సీమాంధ్రలో ఆధిపత్యానికై ఆరాటం

బాబును వదిలి కిరణ్‌పైనే షర్మిల గురి
హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఎపిఇఎంఎస్‌): సీమాంధ్ర ప్రాంతంలో వివిధ పార్టీల మధ్య ఆధిపత్యపోరు రోజుకో మలుపు తిరుగుతోంది. పట్టుకోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌, టీడీపీతో పాటు కాంగ్రెస్‌ కూడాప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ మూడు పార్టీల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మాత్రం రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ.. సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. టీడీపీ అధినేత చంద్రబాబు మనసులో మాత్రం సమైక్యభావం వున్నా.. తెలంగాణలో పార్టీని రక్షించేందుకు రాష్ట్ర విభజనను సమర్ధించినా.. అనంతరం మాటమార్చి సమైక్యాంధ్రకే జై అనేలా వ్యవహరించారు. కాంగ్రెస్‌ అధిష్టానం తెలంగాణకే అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా సీమాంధ్రకు చెందిన మంత్రులు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబడుతూ సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించారు. మరోవైపు షర్మిల సమైక్య శంఖారావం పేరిట బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్‌ చేసి విమర్శనాస్త్రాలు సంధించిన ఆమె.. ముఖ్యమంత్రిని టార్గెట్‌ చేశారు. అధిష్టానం అండతోనే కిరణ్‌కుమార్‌ రెడ్డి సమైక్యాంధ్ర నినాదాన్ని భుజాన వేసుకున్నారని, సీమాంధ్ర ప్రాంతంలో పార్టీని పటిష్టం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించడంతో కాంగ్రెస్‌ వ్యూహాన్ని పసిగట్టిన షర్మిల కిరణపై దృష్టి పెట్టారు. రెండుకళ్ల సిద్ధాంతంతో వ్యవహరించిన చంద్రబాబును సీమాంధ్ర ప్రజలు అంతగా నమ్మడం లేదని భావిస్తున్న ఆమె.. తమ విమర్శల దాడిని కిరణ్‌ వైపు మళ్లించారు. సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు ఉధృతమవుతున్నా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలా చూస్తున్నారంటూ నిత్యం ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ, సీమాంధ్రకు సమన్యాయం చేయలేని కాంగ్రెస్‌ పార్టీకి విభజించే హక్కు ఎవరిచ్చారని నిలదీస్తున్నారు. రాష్ట్ర విభజన అంశం ముఖ్యమంత్రికి ముందే తెలిసినా స్పందించలేదని మండిపడుతోంది. పదవీకాంక్షతోనే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారని, ఇప్పుడేమో సీమాంధ్ర ప్రజలకు ఏదో అన్యాయం జరిగినట్లు.. ప్రజల పక్షాన ఉన్నట్లు నాటకాలు ఆడుతున్నారంటూ మండిపడుతోంది. కిరణ్‌, చంద్రబాబులు ఒకటేనని, వారిద్దరి మధ్య డీల్‌ కుదిరినట్లు నిప్పులు చెరుగుతోంది. భవిష్యత్‌లో సీమాంధ్రలో తమకు పోటీగా కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారనే కారణంగానే షర్మిల సీఎంను టార్గెట్‌ చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా పట్టుకోసం ఆ మూడు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

తాజావార్తలు