హైదరాబాద్, సెప్టెంబర్ 16 : జిహెచ్‌ఎంసి కౌన్సిల్ సమావేశం రసాభాస నడుమ ముగిసింది. సోమవారం ఉదయం కౌన్సిల్ సమావేశం ఆరంభమైంది. గణేశ్ నిమజ్జనం ఏర్పాట్లపై చర్చించేందుకు కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోవడంపై మేయర్ మజిద్‌ను బిజెపి కార్పొరేటర్లు నిలదీశారు. అంతేగాక వర్షాలకు ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు నిర్వహించకపోవడంపై ప్రశ్నించారు. మేయర్ రాజీనామా చేయాలంటూ డిమాండు చేశారు. ఈ నేపథ్యంలో బిజెపి, ఎంఐఎం కార్పొరేటర్ల నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో బిజెపి కార్పొరేటర్లపై సస్పెన్షన్ విధించారు. దీంతో మేయర్ వైఖరిని నిరసిస్తూ బిజెపి కార్పొరేటర్లు జిహెచ్‌ఎంసి కార్యాలయం గేటు వద్ద బైఠాయించారు.




