హైదరాబాద్, సెప్టెంబర్ 16 : అసెంబ్లీని వెంటనే సమావేశపరచాలని లోక్‌సత్తా అధినేత, ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ అన్నారు. సోమవారంనాడు మీడియాతో ఆయన మాట్లాడారు. చట్టసభల్లో విభజనపై చర్చ జరగాలన్నారు. రాష్ట్రంలో సంక్షోభంపై సమగ్రంగా చర్చ జరగాలన్నారు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య నెలకొన్న ద్వేషభావాన్ని నివారించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. ఎవరి వాదాన్ని వారు చాటుకుంటూ రాష్ట్రాన్ని రావణకాష్టంలా మారుస్తున్నారన్నారు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదన్నారు. తెలుగుజాతి మధ్య ఐక్యతను తెచ్చే బాధ్యత కవులు, రచయితలపై ఉందన్నారు. ప్రజల పట్ల తమకు ఉన్న ఆరాధనను.. జాతి పట్ల ఉన్న గౌరవాన్ని పాటల రూపంలో.. గేయాల రూపంలో చాటాలన్నారు. తద్వారా ప్రజల్లో అపోహలు తొలగిపోతాయన్నారు. ప్రజలను జాగృతం చేసేలా కవులు, రచయితలు సహకరించాలన్నారు. సందేశం ఇవ్వాలని కోరారు. విభజనను రాజకీయ కోణంలో చూడడం కేంద్రానికి తగదన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతున్నానని అన్నారు. రాగద్వేషాలకు అతీతంగా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించాల్సిన బాధ్యత చట్టసభలపై ఉందని అన్నారు.




