హైదరాబాద్ : తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు సాంప్రదాయ వస్త్రాలు ధరించి బతుకమ్మ ఆడారు. ” రంగురంగుల పూలకలబోత.మనసు పొరల్లో తంగేడు పూల స్పర్శ.సుతిమెత్తని రేకులుగా విచ్చుకున్న గుమ్మడిపూల సొగసు. గాలికి అలలాగా తలలూపే నీలివర్ణ కట్లపూలు, నల్లని గింజల్ని దాచుకున్న గునుగు పువ్వు మర్మం. వీటన్నింటి పేర్పే బతుకమ్మ. బతుకమ్మ ఒక పూల జాతర. బీళ్లు బీళ్లుగా విస్తరించుకున్న తెలంగాణలో ఆర్బాటపు పండుగ.తెలంగాణ సంస్కృతికి ప్రతీక. తెలంగాణ సాంప్రదాయానికి పునరుజ్జీవనం . తెలంగాణ అస్థిత్వానికి జరిగే పూల పట్టాభిషేకం. బతుకమ్మ అంటే పాటల తలపోత. బతుకమ్మ అంటే పదాల వలపోత. దూరంగా ఉన్న మనసులు కలుసుకునే ఒక ఆర్తి. ఒక సంబరం తనను తాను తవ్విపపోసుకుంటున్న పాట పానాదుల మీదుగా తెలుకుంటూ తేలుకుంటూ పల్లెను చుట్టుముడ్తది. చీకట్లు కమ్ముకుంటున్న రాత్రి పూల వెలుగు ప్రసరిస్తాయి. జాములు తిరిగే దాకా ఆట సాగుతుంటది. ఇది భారతదేశంలోనే గాక ప్రపంచంలో మరెక్కడా లేని ప్లవర్ పెస్టివల్. సెప్టెంబర్ ,అక్టోబర్ నెలల్లో తెలంగాణ ప్రాంతంలో పనిపాటలు తీరి తీరిగ్గా ఉండే సమయం. తెలంగాణలో అప్పటికి తరిలో నాట్లు పూర్తై తొలికలుపులు కూడా అయిపోయి ,మొక్కజొన్న వంటి పునాస పంటలైన పెసరు వంటివి కూడా అయిపోయి రైతులు తీరిగ్గా ఉంటరు. మళ్లీ పంటలు చేతికందే సమయంలో ఆపనుల్లో నిమగ్నమయి ఉంటరు. అందుకే ఈ కొత్త పాత సందులో దొరికే విరామంలో ఈ పండుగ ఉంటుంది. మెట్ట ప్రాంతంలో పూసే పువ్వులు వ్యవసాయ ప్రధాన ఆధారవు అయిన చెరువులు, బావుల్లోకి పూలను సాగనంపడం ,ఆడపడుచుల గౌరవం, అనే మూడుంశాల చుట్టు తిరిగే ప్రకృతి పండుగ బతుకమ్మ.ఎలాంటి ఆటంకాలు మొహామాటాలు లేకుండా స్వేచ్చగా తమని తాము స్త్రీలు వెల్లడించు కోవడానికి బతుకమ్మ సారాంశం. బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆదరించే పెద్ద పండుగ. పూలు వికసించే కాలంలో జలవనరులు సమృద్దిగా పొంగిపొరలే సమయంలో బతుకమ్మ పండుగవచ్చి భూమిలో ,జలంతో ,మానవ అనుభందాన్ని సంబురంగా జరుపుకోబడుతుంది.బరువు, బాద్యతలతో అలసిపోయిన అమ్మాయిని తిసుకువచ్చి సేదతీర్చి పంపడంతో అనుబంధాలకు తెలంగాణ బిడ్డలు ఇచ్చే ప్రాముఖ్యాన్ని తెల్పుతుంది. ప్రకృతిలో మమేకం కావడం ,ప్రకృతి జ్ఞానాన్ని పిల్లల్లో పెంచడం , బతుకమ్మ పండుగలోని పరమార్ధం.
తెలంగాణలో ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ పండుగ





