హైదరాబాద్ : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం జరగని రోజు ఉండదేమో అనేంతగా ప్రజలు భీతిల్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఈరోజు ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ప్రయాణికులు 45 మంది సజీవ దహనంతో మరోసారి తేటతెల్లమైంది. మితిమీరిన వేగం, నాణ్యతలేని రోడ్లు, అర్హత లేని డ్రైవర్లతో ప్రయాణికుల ప్రాణం గాలిలో దీపంగా మారుతోంది. మొన్నటికి మొన్న మంచిర్యాల- లక్ష్సెట్టిపేట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 35 మంది మరణించారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఎన్నో విషాదకర ఘటనలు చెదరని గుర్తులుగా మిగిలిపోతున్నాయి.
నివేదికలు హెచ్చరిస్తున్నా : పట్టని యంత్రాంగం
జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్.సి.ఆర్.బి) వార్షిక నివేదిక ప్రకారం 2007లో దేశవ్యాప్తంగా 4,18,657 ప్రమాదాలు జరిగాయి. వాటిలో 1,14,590 మంది మరణించారు. రాష్ట్ర పోలీస్ శాఖ విడుదల చేసిన నివేదికల ప్ర ప్రకారం 2009లో రాష్ట్రంలో 50,000కు పైగా రహదారి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వాటిలో 15,000మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. వాస్తవానికి ప్రమాదాల్లో మృతులు ,గాయపడిన వారు అంతకంటే ఎక్కువగా ఉంటారని అంచనా.
రాష్ట్రంలో పెరిగిపోతున్న రహదారి ప్రమాదాలు
జాతీయ రహదారుల్లో రాష్ట్రం వాటా 5.9 శాతం, మరణాల్లో మాత్రం 36 శాతం కావడం గమనార్హం. అమెరికాలాంటి అభివృద్ది చెందిన దేశాల్లో ఏటా రెండు శాతం ప్రమాదాలు తగ్గుముఖం పడుతుండగా మనదేశంలో మాత్రం ఏటా ఎనిమిది శాతం పెరుగుదలతో భయానక వాతవరణాన్ని సృష్టిస్తున్నాయి. వలయ రహదారులను ఏర్పాటు చేస్తున్నాం. దేశం పురోగతి సాధిస్తుందని పాలకులు గొప్పలు చెప్పుకోవడం తప్ప రహదారికి అనువైన వాహనాలు అర్హత ఉన్న డ్రైవర్లు , నిబంధనలు పాటించాలని తెలిసేదెన్నడు? పర్యవేక్షణ లేని రవాణా యంత్రాంగం డబ్బు మీద చూపించే ఆసక్తి ప్రయాణికుల రక్షణపై పెట్టకపోవడంతో ప్రమాదాలకు అంతు లేకుండా పోతోంది.,




