Wednesday, 4 November 2026

అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును స్పీకర్‌ శాసన సభలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెదేపా, వైకాపా ఎమ్మెల్యేలు బిల్లు ప్రతులను చించి వేసి నిరసన తెలిపారు. ఈ పరిణామంతో తెలంగాణ ఎమ్మెల్యేలు ఆగ్రహంతో వూగిపపోయారు. బిల్లు ప్రతులను చించివేయడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని పేర్కొంటూ సీమాంధ్ర ఎమ్మెల్యేల వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల మధ్య తోపులాట జరిగింది. పోలీసుసలు అప్రమత్తమై ఘర్షణ తలెత్తకుండా నివారించారు.
బిల్లు ప్రతిని చించివేసిన దేవినేని ఉమ
ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు ప్రతులను సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెదేపా ఎమ్మెల్యే దేవినేని ఉమా అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద చించి వేశారు. ఈ ఘటనను ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఖండించారు. తెదేపా ఎమ్మెల్యేల వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన కమలాకర్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
బిల్లు ప్రతులను తగులబెట్టిన వైకాపా ఎమ్మెల్యేలు
రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద బిల్లు ప్రతులను దహనం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.సభ వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్‌కు చేరుకున్న వైకాపా ఎమ్మెల్యేలు ముందుగా బిల్లు ప్రతులను చించి వేశారు. అనంతరం వాటిని తగులబెట్టారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ప్రభుత్వ చీఫ్‌ వివ్‌ గండ్ర వెంకట రమణ నేతృత్వంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ దశలో వైకాపా, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మధ్య జరిగిన తోపులాటలో వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి కిందపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీల నేతలను సముదాయించి పరిస్థితిని అదుపు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *