హైదరాబాద్: నగరంలోని అమెరికా రాయబార కార్యాలయం ఈ రోజు ఆందోళనలతో అట్టుడుకింది. భారత దౌత్యవేత్త దేవయాని పట్ల అమెరికా పోలీసుల ప్రవర్తనపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు అఖిల భారత విద్యార్థి పరిషత్ అగ్రరాజ్య రాయబార కార్యాలయ ముట్టడికి యత్నించింది. భారతీయులకు అమెరికా క్షమాపణ చెప్పాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ డిమాండ్ చేశారు. మాజీ రాష్ట్రపతిని సైతం అవమానించిన అమెరికా భారతీయులపై జాత్యహంకారాన్ని చూపిస్తోందని ఏబీవీపీ మండిపడింది. విద్యార్థులు పెద్ద ఎత్తున కార్యాలయం ముట్టడికి బయలుదేరడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ప్రధాన రహదారిపైనే ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.




