హైదరాబాద్ : ఉదయం పది గంటల ప్రాంతంలో ప్రారంభమైన బీఏసీ సమావేశం దాదాపు మూడు గంటల పాటు సాగింది. అయినా ముసాయిదా బిల్లుపై చర్చకు ఏకాభిప్రాయం కుదురకపోవడంతో మధ్యాహ్నం రెండు గంటలకు మరోసారి బీఏసీ సమావేశం కానుంది.
స్పీకర్ ఛాంబర్‌లో జరిగిన ఈ బీఏసీ సమావేశంలో ముసాయిదా బిల్లుపై సభలో చర్చ ప్రారంభమైందా లేదా అని సభ్యులు అక్బరుద్దీన్ ప్రశ్నించగా, ఆ వివాదంతో సంబంధం లేకుండా చర్చను కొనసాగిద్దామని సభాపతి సమాధానమిచ్చారు. సమైక్య తీర్మానం చేశాకే చర్చకు సహకరిస్తామని వైకాపా తెలిపింది. గతంలో తీర్మానానికి పట్టుబడితే సస్పెండ్ చేశారని, ఇప్పుడూ అలాగే చేసి చర్చను కొనసాగించాలని తెరాస సభ్యులు సూచించారు.
ఉభయసభల సమావేశాలు వాయిదా
ఈ రోజు కూడా రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతూనే వాయిదాల బాట పడ్డాయి. ఇరుప్రాంత సభ్యులు ఉభయసభల్లోనూ పోడియం వద్దకు చేరి నినాదాలు చేయడంతో సభలు వాయిదా పడ్డాయి. దాంతో స్పీకర్ నాందెండ్ల మనోహర్ శాసనసభ బీఏసీ సమావేశం ప్రారంభించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమిర్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు హాజరు కాలేదు. విభజనపై ఇతర రాష్ట్రాల్లో చర్చించిన తీరుపై అధ్యయన నివేదికను స్పీకర్ కార్యాలయం పార్టీలకు అందజేసింది.




