హైదరాబాద్, జనవరి 20: మెదక్ ఎంపీ విజయశాంతి టీఆర్‌ఎస్ నాయకులపై చేస్తున్న ఆరోపణలను ఆ పార్టీ ఎమ్మెల్యే కె.తారకరామారావు తీవ్రంగా ఖండించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెదక్ జిల్లాలో రైల్వేలైన్ ప్రారంభోత్స కార్యక్రమంలో మాట్లాడిన విజయశాంతి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర్‌రావు, ఆయన కుటుంబం పార్టీ నాయకులపై వివిధ ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్‌లో ఆమెకు సరైన ప్రాధాన్యత లభించకపోవడం.. టిక్కెట్ రాదోనన్న భయంతో ఆమె మానసిక పరిస్థితి లేక తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. తాము, తమ నాయకులు స్విస్ బ్యాంకుల్లో ఎంత ధనం దాచారో ఆధారాలుంటే బయటపెట్టి రుజువు చేయాలని సవాల్ విసిరారు. పన్నేండేళ్లుగా ప్రజల కోసం నిఖార్సయిన ఉద్యమం చేశామని, ఈ సమయంలో తాము వసూళ్లకు పాల్పడితే మమ్మల్ని వదిలేవారా అని ప్రశ్నించారు. తమపై ఆరోపణలు చేసిన వారు ఆధారాలతో ముందుకు రావాలని, అంతేతప్ప అసత్య ఆరోపణలు చేయవద్దని కేటీఆర్ సూచించారు.




