Wednesday, 4 November 2026

మీ కుట్రలు ఫలించవ్‌

సీమాంధ్ర పాలకుల వల్లే తెలంగాణకు అన్యాయం
టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్‌
హైదరాబాద్‌, జనవరి 20: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు చేస్తున్న కుట్రలు ఫలించవని టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. సోమవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ, సీమాంధ్ర ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలు, అక్కడి నేతలు కొత్త వాదన తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కువ రోజులు ముఖ్యమంత్రి పదవులు అనుభవించింది సీమాంధ్ర నేతలు కాదా అని ప్రశ్నించారు. ఆంధ్ర సీఎంల పాలనలో సీమాంధ్ర ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందలేదని  ప్రశ్నించారు. సీమాంధ్ర పాలకులు వ్యక్తిగత ప్రాముఖ్యలకు ప్రాధాన్యం ఇచ్చారే తప్ప ప్రజల బాగోగుల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. సీమాంధ్ర నేతల స్వార్ధం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, అందుకే తాము ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. రాయలసీమ, ఫ్యాక్షనిజం ముసుగులో అభివృద్ధి చెందలేదన్నారు. తెలంగాణ ప్రజలను అవమానపరిచి, కించపరిస్తే సహించమన్నారు. తెలంగాణ వనరులు, నిధులు దోపిడీకి గురుతుండబట్టే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ఈటెల వివరించారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతికేవారని పేర్కొన్నారు. తెలంగాణ  ప్రజలను బానిసల్లా చేసుకొని ఆంధ్ర పాలకులు నిరంకుశంలా వ్యవహరించారని, అందుకే తెలంగాణ ప్రజలు ఆంధ్ర పాలకులపై తిరగబడుతున్నారని చెప్పారు. మంత్రి శైలజానాథ్‌ తన తీరును మార్చుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రజలపై పిచ్చి ప్రేలాపనలు మానుకోకపోతే తెలంగాణ ప్రజలు తగిన శాస్తి చెబుతారని ఆయన హెచ్చరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *