వైసీపీ ఎమ్మెల్యే భూమన డిమాండ్
హైదరాబాద్, జనవరి 20: శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చకన్నా ముందే ఓటింగ్ నిర్వహించాలని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ, స్పీకర్ తన విశిష్ట అధికారాలను ఉపయోగించుకొని చర్చ కన్నా ముందే సమైక్య తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని ఆయన కోరారు. 72,75రూల్స్ ప్రకారం.. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్య తీర్మానం చేయమని తాము చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అన్ని పార్టీలకంటే వైసీపీ రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు సభలో ఒక మాట, బయట మరోమాట మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ నేతలు తమ అధినేతలకు తలొగ్గి సమైక్యవాద ముసుగులో విభజన వాదం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బిల్లుపై చర్చ జరిగితే రాష్ట్ర విభజనకు అంగీకరించవచ్చని, అందుకే చర్చకన్నా ముందు ఓటింగ్ పెట్టాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. చర్చ జరిగిన తర్వాత విభజన వాదులెవరో , సమైక్యవాదులెవరో తెలిసిపోతుందని చెప్పారు. రాష్ట్రపతి పంపిన బిల్లుపై ఉద్దేశపూర్వకంగానే అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీలు తమ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నాయని ఆయన మండిపడ్డారు. విభజనకు వైసీపీ పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పూర్తిగా నీరుగారుస్తున్నారని ఆరోపించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ అనవసర విమర్శలు చేస్తున్నాయని చెప్పారు. టీడీపీ కాపాడుకునేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.. రాష్ట్రాన్ని కాపాడేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు.




