Wednesday, 4 November 2026

వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ కోసం ముందస్తు వ్యూహం

తనతోపాటు మరికొందరు ఉన్నారన్న అరవింద్‌ రెడ్డి
హైదరాబాద్‌,జనవరి24: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ నేతలు తమ వ్యూహాలు మార్చుతున్నారు. ఏ పార్టీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్‌ ఉంటుందో ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుని పావులు కదుపుతున్నారు. వివిధ పార్టీల్లో ఉన్నవారు ఇప్పటి నుంచే పార్టీలు మారేందుకు రంగం సిద్దం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవింద కుమార్‌ రెడ్డి తాజాగా పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఆయన ఇక కాంగ్రెస్‌లో చేరనున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందే టీఆర్‌ఎస్‌లో ఆయన వ్యవహారంతో కలకలం మొదలయ్యింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కారు దిగి.. హస్తాన్ని అంది పుచ్చుకుంటున్నారు. ఇప్పటికే మెదక్‌ ఎంపీ విజయశాంతి టిఆర్‌ఎస్‌ వీడారు. తాజాగా మంచిర్యాల టీఆర్‌ఎస్‌ శాసన సభ్యుడు గడ్డం అరవింద్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. హస్తిన నుంచి తిరిగి వచ్చిన ఆయన తనతో పాటు మరికొంతమంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని బాంబు పేల్చారు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని చాలాసార్లు తాను కేసీఆర్‌కు చెప్పానన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘనత సోనియాగాంధీదేని అరవింద్‌ రెడ్డి కొనియాడారు. అయితే గతంలోనే ఆయన పార్టీని వీడుతారని వార్తలు వచ్చాయి. అప్పట్లో ఎమ్మెల్యేల రాజీనామా, ఉప ఎన్నికల కారణంగా ఆయన ఆగిపోయారు.’తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించిన కారణం పూర్తయింది. తెలంగాణ ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్‌ పార్టీకి, సోనియాగాంధీకి కృతజ్ఞత చూపించాలని ప్రజలు కోరుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయకపోయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేయండి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలం అంతా విూ వెంటనే ఉంటాం. ఇంకా గడువును పెంచొద్దని దిగ్విజయ్‌ సింగ్‌కు అరవింద్‌రెడ్డి వివరించినట్లు సమాచారం. అరవిందరెడ్డి వైఖరిపై టిఆర్‌ఎస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. . ఇదిలావుంటే ఎవరు వెళ్ళినా తమకొచ్చే నష్టం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్లు దక్కవనే చాలామంది టిఆర్‌ఎస్‌ను వీడేందుకు సిద్దం అవుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందే తమ సీటు చక్కబెట్టుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ విలీనం కాకపోయినా తామంతా అండగా ఉంటామంటూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్‌ అధిష్టానానికి భరోసా ఇవ్వడం వెనకా ఇదే ఆంతర్యం దాగి ఉందని భావిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన తర్వాత కాంగ్రెస్‌తో కలిసి నడుస్తామని మంచిర్యాల శాసనసభ్యుడు గడ్డం అరవింద్‌రెడ్డి ద్వారా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌ సింగ్‌కు రాయబారం పంపినట్లు సమాచారం. తెలంగాణలోని 119 స్థానాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ బలంగా… గెలుపు లేదా రెండో స్థానంలో ఉంది. కానీ టీఆర్‌ఎస్‌ ఖమ్మం, హైదరాబాద్‌, రంగారెడ్డి (రెండు స్థానాలు మినహా), నల్లగొండ (రెండు స్థానాలు మినహా) జిల్లాల్లో పోటీచేయడానికే అభ్యర్థులు లేరని చెబుతున్నారు.అరవింద్‌రెడ్డి నాలుగైదు రోజులుగా శాసనసభకు హాజరుకావడంలేదని టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నాయకులు ఈటెల రాజేందర్‌ లాబీల్లో వ్యాఖ్యానించారు. విలీనంపై తొందర ఎందుకన్నట్టుగా పార్టీలో అనుకున్నామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *