నేతలకు చంద్రబాబు వినతి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 :కాంగ్రెస్అడ్డగోలుతనాన్ని నిలువరించండిి.. ఏకపక్షంగా విభజనకు పూనుకుంది.. అదే తీరున ముందుకుపోతోంది.. అడ్డుకోండి అని అందర్నీ కోరుతున్నానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీతో చంద్రబాబు, ఆయనతో పాటు పలువురు ఎంపీలు భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత వెలుపలకు వచ్చిన అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. అన్నింటా తానై నడుస్తోంది.. ప్రజల ఆకాంక్షను పట్టించుకోవడం లేదు.. ప్రజల నిరసనను ఆలకించడం లేదు.. ఒంటెద్దు పోకడతో ముందుకు పోతోంది. తెలుగుజాతిని రెండు ముక్కలు చేసేందుకు సమాయత్తమవుతోంది. అయిదేళ్లుగా రాష్ట్రాన్ని అన్నింటా భ్రష్టు పట్టించింది. విద్వేషాలు రేపింది. విడిపోయేలా చేసింది. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సీఎం కిరణ్‌ను, మంత్రులను కట్టడి చేయలేకపోతోంది. సీఎం ఒకవర్గంగా ఏర్పడి శక్తిస్థల్‌లో దీక్ష చేయనున్నారు.. కాంగ్రెస్‌కే చెందిన సీమాంధ్ర నేతలు కొందరు నెహ్రూ విగ్రహం వద్ద నిరసన తెలియజేయనున్నారు. ఇలా ఒకే పార్టీలో బృందాలుగా విడిపోయి ప్రజల బాగోగులను పట్టించుకోవడం లేదు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేందుకు నడుం కట్టారు. అన్ని విషయాలను అద్వానీకి తెలియజేశాను. అందరికీ సమన్యాయం జరిగేలా చూడాలని కోరాను. లేకపోతే బిల్లును అడ్డుకోవాలని సూచించాను. జాతీయ నాయకులందర్నీ కలుస్తూ ఇదే విషయాన్ని కోరుతున్నాను. రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ పార్టీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతికిస్తామంటున్నారు. నీటి పంపిణీ కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామంటున్నారు. ఉమ్మడి రాజధానిగా ఉంచుతామని చెబుతున్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆకాంక్షకు భిన్నంగా నడుచుకుంటున్నారు. విభజన అంటే ఒక పద్ధతి ప్రకారం జరగాల్సి ఉంది. సామరస్యపూర్వక ధోరణిలో ఇరు ప్రాంతాల ప్రజలు మెచ్చుకునేలా విభజన ప్రక్రియ సాగాల్సి ఉంది. తాము కూడా అదే కోరుకుంటున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అందుకు భిన్నంగా నడుస్తోంది. ప్రజలను రెచ్చగొట్టి విభజించాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ అనాలోచిత విధానాల వల్ల రాష్ట్ర ప్రజలు అయిదేళ్లుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదు..ఇరుప్రాంతాలకు సమ న్యాయం జరగాలన్నదే తమ ఆకాంక్ష..కాంగ్రెస్ దమనకాండను అడ్డుకోవడమే తమ లక్ష్యం..అందుకే అందరం కదిలివచ్చాం.. జాతీయ నాయకులను కలుస్తున్నాం.. కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలను తెలియజేస్తున్నాం.. సమన్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నామని తెలిపారు. చంద్రబాబు వెంట ఎంపీలు సీఎం రమేష్, నామా నాగేశ్వరరావు, మోదుగుల, శివప్రసాద్ తదితరులు ఉన్నారు. ఇదిలాఉండగా ఎపిభవన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు దీక్ష చేపట్టారు. చంద్రబాబునాయుడు,ఆయన బృందం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సీపీఐ అగ్రనేత బర్దన్తోను, సాయంత్రం 4గంటలకు బిజెపి నేత సుష్మాస్వరాజ్తోను, 5 గంటలకు లాలూప్రసాద్‌యాదవ్, తదితరులతోనూ భేటీ కానున్నారు.




