Tuesday, 3 November 2026

బాసరలో వసంతిపంచమి ఉత్సవాలు

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 4: చదువుల తల్లి కొలువు దీరిన బాసరలో లక్షలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు  తరలివచ్చారు. అమ్మవారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మంగళవారం వసంత పంచమి సందర్భంగా వేకువజామున 2గంటల నుండి సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి అభిషేకం, అలంకరణ, నివేదిన, మంగళహారతి నిర్వహించారు. వసంత పంచమి ఉత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా వేలాదిమంది చిన్నారులు అక్షరాభ్యాసాన్ని చేపట్టారు. ప్రతి ఏడాది మాఘశుద్ధపంచమి దినాన నిర్వహించే అమ్మవారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. దక్షిణ భారతంలోనే నెలకొన్న ఏకైక సరస్వతి ఆలయంలో మంగళవారం ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. చిన్నారుల అక్షర శ్రీకార పూజలకు దివ్యమైన మూహూర్తంకావడంతో మంగళవారం  బాసరలో భారీ అక్షరాభ్యాస పూజలు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వాహనాల రద్దీతో భక్తులు ఇబ్బంది పడకుండా వేరు వేరు పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేయడంతో పాటు, గోదావరి స్నాన ఘట్టాల వద్ద దొంగతనాలు, ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *