Tuesday, 3 November 2026

ఎన్నికలకు భారీ బందోబస్తు: ఎస్పీ

ఆదిలాబాద్‌, మార్చి 7 : ఎన్నికలను సజావుగా, సక్రమంగా నిర్వహించే విధంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు ఎస్పీ భూపాల్‌ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ  నియమనిబంధనలు పాటించాలని, లేనట్టయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల్లో 7వేల మంది పోలీస్‌ సిబ్బంది పాల్గొంటారని, మరో 9 కంపెనీల పారామిలటరీ బలగాలు అవసరమని ప్రభుత్వానికి విన్నవించినట్టు చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో తనిఖీలు చేపట్టామని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఎక్కువ మొత్తంలో డబ్బును రవాణా చేయవద్దని, అలా చేస్తే అందుకు పూర్తి వివరాలను తమ వద్ద ఉంచుకోవాలన్నారు. మద్యం అమ్మకాల విషయంలో ప్రత్యేక నిఘా వేశామని అన్నారు. అనధికారికంగా మద్యం నిలువలు ఉన్నా, విక్రయించినా చర్యలు తప్పవన్నారు. కాగజ్‌నగర్‌లో 24 క్వింటాళ్ల అక్రమ బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.  జిల్లా మహారాష్ట్రకు సరిహద్దులో ఉండటం వల్ల మావోయిస్టుల ప్రభావం లేకుండా పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రౌడీషీటర్లుగా నమోదు అయిన వారికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో లెక్కలు చూపని రూ.23 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *