Tuesday, 3 November 2026

తేలని పొత్తులు.. అయోమయంలో శ్రేణులు

ఆదిలాబాద్‌, మార్చి 7 :  ఈ నెల 30న జరగనున్న పురపాలక సమరంలో పొత్తుల విషయమై వివిధ రాజకీయ పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు ఉండగా, మంద మర్రి మినహా ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్‌, నిర్మల్‌, భైంసా, కాగజ్‌నగర్‌, మంచిర్యాల, బెల్లంపల్లి పురపాలక సంఘాల పరిధిలోని 189 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 5 మున్సిపాలిటీలను మహిళలకు రిజర్వ్‌ చేయగా నిర్మల్‌ మున్సిపాలిటీని జనరల్‌కు కేటాయించారు. పురపాలక సంఘాల ఎన్నికల్లో వార్డుల నుంచి పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఆసక్తి చూపడంతో గతంలో లేనివిధంగా తీవ్ర పోటీ నెలకొంది. పొత్తలతో నిమిత్తం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యారు. అన్ని మున్సిపాలిటీలలో అధ్యక్ష స్థానాలపై కన్ను వేసిన నాయకులు రిజర్వేషన్ల కారణంగా తమ కుటుంబ సభ్యులను పోటీ చేయించేందుకు సిద్ధమవుతున్నారు.  5 మున్సిపాలిటీలను మహిళలకు కేటాయించడంతోపాటు 89 వార్డులను మహిళలకు కేటాయించడంతో నాయకలు కంగుతిన్నారు. మూడు సంవత్సరాలుగా ఎన్నికల కోసం ఎదురు చూసిన నాయకులకు రిజర్వేషన్లు నిరాశపరిచాయి. పోటీ తీవ్రంగా ఉండటంతో పార్టీ నుంచి టికెట్‌ రాకపోతే స్వతంత్రంగా పోటీచేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు మున్సిపల్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయ వేడి నెలకొంది. మున్సిపల్‌ ఎన్నికల తరువాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో తమ పట్టును నిలుపుకునేందుకు అన్ని పార్టీలు శ్రమిస్తున్నాయి. రిజర్వేషన్ల కారణంగా ఎక్కువ శాతం మహిళలకు కేటాయించడంతో తమ కుటుంబ సభ్యులను, శ్రేయోభిలాషులను రంగంలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పురపాలక సంఘాలలో మహిళలదే రాజ్యంకానున్నది. ఈ నెల 10 నుంచి నామినేషన్ల పర్వం కానుండటంతో అప్పటి వరకు పొత్తుల విషయమై తేలే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా టీఆర్‌ఎస్‌, సీపీఐల మధ్య, టీడీపీ, సీపీఎం మధ్య పొత్తుల విషయమై తేలే అవకాశాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *