– తెరపైకి కిరణ్, పవన్‌ల పార్టీలు
– సీమాంధ్రలో బహుముఖ పోటీలు
– ఏ మేరకు ప్రభావం ఉంటుందనే చర్చలు!
హైదరాబాద్, మార్చి 7 : రాష్ట్ర రాజకీయాల్లో నూతన రాజకీయ పరిణామాలు చోటు చేసకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సీమాంధ్రలో రాజకీయ పార్టీల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. తెలుగువారి ఆత్మగౌరం మేర రాష్ట్ర విభజనను వ్యతిరేకంగా తాను ఒక కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు తాజా మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ప్రకటించారు. ఈ నెల 12న రాజమండ్రిలో సభ ఏర్పాటు చేసి ఆ సభలోనే పార్టీ పేరు, జెండా, తదిదర అంశాలను వెల్లడిస్తానని ప్రకటించారు. తెలుగువారి గుండెకు అండగా ఉంటామని తెలుగు ప్రజల ఆత్మగౌరం, అభివృద్ధి లక్ష్యమని లక్ష్యంగా పార్టీని పెడుతున్నట్లు మాజీ సీఎం ప్రకటించారు. సీమాంధ్రకే తమ పార్టీ పరిమితమిని కూడా ప్రకటించారు. ఇప్పటికే సీమాంధ్రలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు పట్టుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నాలుగు పార్టీలకు తోడు కిరణ్ పార్టీ కూడా జత కానుంది. ఇదే మాదిరిగా కేంద్ర మంత్రి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సోదరుడు పవన్‌కళ్యాణ్ కూడా రాజకీయ అరంగ్రేటానికి శ్రీకారం చుట్టనున్నారు. రాజకీయ రంగప్రవేశంపై మార్చి2వ వారంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్న పవన్‌కళ్యాణ్ ఈ నెల 9వ తేదీన తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనందున ఇప్పుడు పార్టీ పెట్టే అవకాశాలు లేకపోవడంతో ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగాలని పవన్ కళ్యాణ్ దాదాపుగా నిర్ణయించారు. ఈ మేరకు శంకరపల్లిలోని తనఫాంహౌజ్‌లో మంతనాలు సాగిస్తున్నారు. స్వతంత్రంగానే తన అభ్యర్థులను పోటీలో నిలపాలని నిర్ణయించారు. 41 శాసనసభ, 9 పార్లమెంటు స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీకి నిలపనున్నారు. ఆయన సొంతంగా కాకినాడ, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఏదో ఒక దాని నుండి పవన్‌పోటీ చేయనున్నారు. పవన్‌కళ్యాణ్ తాను రాసిన పుస్తకాన్ని కూడా మీడియా ముందుకు వచ్చే సమయంలోనే ఆవిష్కరించనున్నారు. కేవలం అధికార లక్ష్యంగా కాకుండా ప్రజా సమస్యలను ప్రభుత్వాన్ని నిలదీసే లక్ష్యంగా రాజకీయంలోకి రానున్నారు. ప్రభుత్వాలు ఎలా పనిచేయాలి? సామాన్యుని ఆకలి బాధ ఎలా తీర్చాలి? ఎలా జీవితాలను ఎలా గాడిలో పెట్టాలి? సమాజం మారాలంటే ఏం చేయాలి అందుకోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలి? ఇటువంటి అనేక అంశాలపై ఆయన ఒక పుస్తకంలో అభిప్రాయాలు చెప్పినట్లు తెలిసింది. రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టించే లక్ష్యంగా పవన్ ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కూడా దృష్టి సారించనున్నట్లు సమాచారం. రాజమండ్రి శాసనసభ నుండి సినీనటుడు అలీ, భీమవరం నుండి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌శ్రీనివాస్‌లను పోటీ చేయించాలని పవన్‌కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే పవన్ రాజకీయ అరంగేట్రంపై చిరంజీవి కుటుంబానికి సన్నిహితుడు, సినీరంగ ప్రముఖుడు అశ్వినిదత్ ధృవీకరించారు. పవనిజాన్ని చాటి చెప్పే లక్ష్యంగా పవన్‌కళ్యాన్ తన మనుషులను ఇండిపెండెంట్‌లుగాపోటీ చేయిస్తారని ఆయన వెల్లడించారు. తాను తెలుగుదేశంపార్టీకి చెందిన వ్యక్తినైనా పవన్‌కళ్యాణ్‌కు సన్నిహితుడినని పేర్కొన్నారు. ఇదిలాఉండగా చిరంజీవి అభిమానుంతా దాదాపుగా పవన్‌తో వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో పవన్‌కల్యాణ్ ఒక రాజకీయ వ్యక్తిగా ఎదగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇకపోతే కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెడితే వెంట ఎంతమంది ఉంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెంట ఉన్నవారంతా ప్రస్తుతం ముఖం చాటేసారు. కేవలం బహిష్కృత ఎంపీలైన హర్షకుమార్, పబ్బంహరి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, సాయిప్రతాప్, పితాని సత్యనారాయణలుమాత్రమే ఉన్నారు. గతంలో ఆయన వెంట ఉన్న గంటా బృందం ఇప్పటికే టిడిపిలో చేరిపోయింది. బహిష్కృత ఎంపీలైన అనంత వెంకటరామిరెడ్డి వెంట రాకపోగా, మాగుంట శ్రీనివాసుల రెడ్డి టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇక తాను పోటీ చేయబోనంటూ ప్రకటించారు. దీంతో కిరణ్‌వెంట ఎంతమంది వస్తారనేది ప్రజల మద్దతు ఉంటుందా అన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రరాజకీయాల్లో నూతన పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితులు కనిపించడమే కాకుండా బహుముఖ పోటీలు అనివార్యంగా కనిపిస్తున్నాయి.




