ఓటర్ను ఆకట్టుకునేందుకు యత్నం
హైదరాబాద్్, మార్చి 7 :రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల వేడి.. ఎక్కడ చూసినా ఎన్నికలపైనే చర్చ.. ఓటర్ల నాడిని పసిగట్టే యత్నాల్లో అన్ని రాజకీయ పార్టీలు తలమునకలవుతున్నాయి. కొన్ని పార్టీలయితే ఇప్పటికే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు యత్నిస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణాలో తమకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. రెండు ప్రాంతాల్లోనూ అధికారంలోకి వస్తామన్న ధీమాను టిడీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణాలో అధికారం తమదేనన్న ఆశాభావంతో టిఆర్ఎస్ ఉంది. సీమాంధ్రలో అధికారాన్ని హస్తగతం చేసుకుంటామన్న ధీమాతో వైఎస్ఆర్సిపి ముందుకు సాగుతోంది. బిజెపి, లోక్‌సత్తా సైతం తాము కొన్ని సీట్లు సాధించగలమన్న ధీమాతో ఉన్నాయి.
అభ్యర్థుల ఎంపికపై పరుగో..పరుగు!
ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ ఉష్ణోగ్రత తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే మునిసిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్న వివిధ పార్టీల నాయకులకు.. మే 12 వరకు ఉక్కిరి బిక్కిరే. వరుస ఎన్నికలు.. రాజకీయ పార్టీల నేతలను పరుగులు పెట్టిస్తున్నాయి. అభ్యర్ధికి మంచి పేరుందా.. అతడి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు.. అనే విషయాలపై పలు పార్టీలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఆ అభ్యర్థి అయితే ఎలా ఉంటుంది.. ఈయనైతే ఎలా ఉంటుంది అన్న దానిపై పలు పార్టీలు ఆరా తీస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో సామాజిక వర్గంతో పాటు, ఆర్థికంగా బలమున్న వారా.. కాదా.. అనే విషయాలపై కూడా కూపీ లాగుతున్నాయి. విజయం సాధించేందుకు అతనికి ఉన్న అవకాశాలు ఏమిటనే విషయంపై కూడా ఆలోచిస్తున్నారు. గతంలో రాజకీయ అనుభవం ఉన్న వారికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిసింది. సీమాంధ్ర ప్రాంతంలో ఇప్పటివరకు ప్రధానంగా టీడీపీ, వైఎస్ఆర్సిపి మధ్యనే పోటీ నెలకొంది. గురువారం సాయంత్రం పార్టీ పెడుతున్నట్టు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించడంతో.. త్రిముఖ పోటీ తప్పదని అర్ధం కావడంతో అభ్యర్థుల కోసం పరుగులు పెడుతున్నారు.మునిసిపల్ ఎన్నికల్లో అధికారికంగా నిలబెట్టకపోయినా.. స్వతంత్రులుగానైనా రంగంలోకి అభ్యర్థులను దింపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా అన్ని పార్టీల్లోనూ అయారాం.. గయారాంల సందడి రోజు రోజుకు పెరుగుతోంది. ఆర్థికంగా డబ్బు పెట్టలేక పోయినా.. తమను ఫలానా పార్టీ పిలుస్తోందని.. టిక్కెట్టు ఇవ్వనున్నదని కొందరు ప్రచారం చేసుకుంటున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే ఏదొక పార్టీ తమను పిలిచి టిక్కెట్టు ఇవ్వకుంటుందా.. వారే డబ్బు పెట్టి గెలిపించకపోతారా అన్న ఆశతో కొందరు ఎదురు చూస్తున్నట్టు సమాచారం.
కత్తిమీద సాములా..
రాజకీయ పార్టీల్లో సందడి ఆరంభమైంది. ఎన్నికల పొత్తులు, సర్దుబాట్లు, స్వతంత్రంగా పోటీ చేయడం తదితర అంశాలపై పార్టీల నేతలు వ్యూహాలు రూపొందించుకుంటున్నట్టు తెలిసింది. జనాకర్షక విధానాలకు కొన్ని రాజకీయ పార్టీలు ఉపక్రమిస్తుంటే.. ప్రజా సమస్యల పరిష్కారానికి మరికొన్ని పార్టీలు హామీ ఇస్తూ ముందుకు వెళ్లాలని భావిస్తున్నాయి.విభజనకు సహకరించిన ముద్రతో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న టీడీపీ నేతలకు ఈ ఎన్నికలు కత్తిమీద సాములా తయారయ్యాయని కొందరంటున్నారు. పాత నేతల మధ్య టిక్కెట్ల కోసం కుమ్ములాట.. వలసబాట పడుతుండడంతో కొందరు నేతలు తలలు పట్టుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ ఘోరమని అంటున్నారు. ఆ పార్టీ తరఫున బరిలో నిలిచేందుకు చివరికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం ఆసక్తి చూపడం లేదని తెలిసింది. కీలక నేతలంతా వలస బాటలో ఉండడంతో అభ్యర్థుల కోసం ఆ పార్టీ నేతలు తంటాలు పడుతున్నట్టు తెలిసింది.
ఎన్నికల పోరు ఇలా..
–మున్సిపల్ ఎన్నికలు 146 మునిసిపాలిటీల్లోనూ, పది కార్పొరేషన్లలోను జరగనున్నాయి. ఈ నెల 10న నోటిఫికేషన్ జారీ కానున్నది. 14వ రకు నామినేషన్ల గడువు కొనసాగనున్నది. మార్చి 30న పోలింగ్ జరగనున్నది.
–పార్లమెంటు ఎన్నికలు.. 543 లోక్‌సభ స్థానాలకు గాను ఎన్నికల ఘట్టం ఏప్రిల్ 7 నుండి ప్రారంభం కానున్నది. మే 12 వరకు కొనసాగనున్నది. మే 16న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ.. కొనసాగనున్న విషయం విదితమే.
–రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. తెలంగాణాలోని 10 జిల్లాల్లోని.. 119 అసెంబ్లీ స్థానాలకు.. 17 ఎంపీ స్థానాలకు.. ఏప్రిల్ 30న పోలింగ్.. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 175 అసెంబ్లీ స్థానాల్లోనూ.. 25 ఎంపీ స్థానాల్లోనూ మే 7న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.




