Tuesday, 3 November 2026

టిఆర్‌ఎస్‌ ఉద్యమ పార్టీ కాదు.. రాజకీయ పార్టీ : నాగం

హైదరాబాద్‌, మార్చి 7 : నిన్నటి వరకు టిఆర్‌ఎస్‌ పార్టీ ఉద్యమ పార్టీ అంటూ ప్రజలను మభ్యపెడుతూ రాజకీయ లబ్ధిపొందిన టిఆర్‌ఎస్‌ నేడు రాజకీయ పార్టీ అని ఆ పార్టీ అధినేత కెసిఆర్‌ పేర్కొనడాన్ని బిజెపి ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని మంత్రి పదవులు అనుభవించారని, ఆనాడు ఉద్యమ పార్టీగా పొత్తు పెట్టుకున్నారా, రాజకీయ పార్టీగా పొత్తు పెట్టుకున్నారా అని ప్రశ్నించారు. 2009లో టిడిపి, సిపిఐ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీచేసి లబ్ధిపొందారని, అప్పుడు కూడా ఉద్యమ పార్టీగా పొత్తు పెట్టుకున్నారా, రాజకీయ పార్టీగా పొత్తు పెట్టుకున్నారా అని ప్రశ్నించారు. టిఆర్‌ఎస్‌ ఉద్యమ పార్టీ అయితే రాజకీయాలతో ఆ పార్టీకి సంబంధమేమిటని ప్రశ్నించారు. ఉద్యమంగా ఉండాలే తప్ప రాజకీయంగా ఎందుకు పోటీ చేస్తుందని ప్రశ్నించారు. కెసిఆర్‌ వైఖరి చూస్తుంటే చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకున్న చందలా ఉందని నాగం దుయ్యబట్టారు. పార్లమెంట్‌లో బిజెపి తెలంగాణాపై పార్లమెంట్‌లో బిల్లు పెట్టినప్పుడు తెలంగాణ గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదని, ఆనాడు ఎక్కడున్నావని ప్రశ్నించారు. నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటు క్రెడిట్‌ నాదేనని గొప్పలు చెబుకుంటున్నారని, క్రెడిట్‌ అన్నది నీ సొంతం కాదని అన్నారు. దీనివెనక ఎందరివో త్యాగాలు, పోరాటాలు ఉన్న విషయం గుర్తించాలని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పునాది వేసింది బిజెపియేనని అన్నారు. తెలంగాణ పంటకు విత్తనం నాటింది బిజెపి అయితే, దానికి కొందరు నీరు పోశారని, మరికొందరు ఎరువు వేశారని, ఇంకొందరు రక్షించారని అన్నారు. పంట చేతికొచ్చిన తర్వాత నాదేనంటూ చెప్పడం ఎంతవరకు సమంజసమని నాగం ప్రశ్నించారు. తప్పుడు మాటలతో ప్రజలను ఎంతోకాలం మోసం చేయలేరని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎవరివల్ల ఏర్పడితో ప్రజలకు తెలుసునని, ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇస్తారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *