హైదరాబాద్‌్, మార్చి 7 : మహిళలపై అత్యాచారాలు పెరిగిపోవడంపట్ల బిజెపి మహిళామోర్చా ఆందోళన వ్యక్తంచేసింది. మహిళలపై జరిగే అత్యాచారాలపై ఎన్ని చట్టాలు తెచ్చినా సమాజంలో మహిళల్లో చైతన్యం వస్తేతప్ప వాటిని అరికట్టలేమని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి నిర్మల సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘మహిళలపై అత్యాచారాలు – చట్టాలు’ అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సీతారామన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నిర్భయపై జరిగిన అత్యాచారం తర్వాత దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా ప్రజలలో వ్యతిరేకత వచ్చిందని, దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం గత్యంతరం లేని పరిస్థితుల్లో నిర్భయ చట్టం తెచ్చిందని అన్నారు. అత్యాచారాలకు సంబంధించి దేశవ్యాప్తంగా లెక్కలుచూస్తే 18 సంవత్సరాలలోపు యువత అధికంగా అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు సర్వేలో వెల్లడయ్యాయని అన్నారు. 18 సంవత్సరాలకు పైబడిన వారికి సంబంధించి నిర్భయ వంటి చట్టం ద్వారా శిక్షలు పడినా, 18 ఏళ్ళలోపు వారికి సంబంధించి చట్టాలు లేకపోవడంతో మైనర్ పేరుతో కేసుల నుండి బయటపడుతున్నారని అన్నారు. 1969లో వరకట్న నిరోధక చట్టం అమల్లోకి వచ్చినా నేడు వరకట్న వేధింపులు యధావిధిగా కొనసాగుతున్నాయని అన్నారు. నేడు మగవారితో సమానంగా మహిళలు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నా వారికి వరకట్న సమస్యలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మొత్తంమీద చూస్తే వరకట్నాలు, అత్యాచారాలకు సంబంధించి సమాజంలో ఎంతో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు మహిళలు రాజకీయంగా, సామాజికంగా చైతన్యవంతులై ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశంలో జరిగే ఎన్నికల్లో మహిళల ఓటుశాతం రోజురోజుకు తగ్గుతోందని అన్నారు. రాజ్యాంగం మహిళలకు కల్పించిన ఓటుహక్కును సద్వినియోగం చేసుకుని రాజ్యాధికారంలో భాగస్వామైనప్పుడే వారిపై జరిగే అత్యాచారాలను అధిగరమించవచ్చని అన్నారు. అత్యాచారాల నిరోధానికి రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచి బిజెపి ఓట్లువేసి గెలిపించాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు.




