హైదరాబాద్, మార్చి 7 :జంటనగరాల్లో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే..! పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థులు ఎవరెవరన్న దానిపై చర్చ సాగుతోంది. ఎవరి లెక్కలు వారే వేసుకుంటున్నారు. ఎవరి వాదనలు వారు విన్పిస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో సస్పెన్స్ వీడడం ఖాయమని పలుపార్టీల శ్రేణులు అంటున్నాయి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదంటే.. మల్కాజ్‌గిరి! మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానంపై చర్చ సాగుతోంది. ఇక్కడి నుండి టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేయనున్నారని కొందరు.. పవన్‌కల్యాణ్ బరిలోకి దిగనున్నారని మరికొందరు.. అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్ గిరి పార్లమెంటులోని మల్కాజ్‌గిరి, ఉప్పల్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కంటోన్మెంటు అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తిగాను.. కూకట్‌పల్లి, ఎల్బీనగర్ పాక్షికంగా.. కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి మంచి పట్టు ఉంది. సీమాంధ్రులు అధికంగా నివసించే ప్రాంతాలు కావడం ఆ పార్టీకి బాగా కలిసి వచ్చింది. అధినేతను అక్కడ నుండి బరి లోకి దింపేందుకు పార్టీ శ్రేణులు, టీడీపీ అభిమానులు సైతం యత్నిస్తున్నట్టు తెలిసింది. అలాగే ఈ స్థానంపై వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్మోహన్‌రెడ్డి కూడా కన్నువేసినట్టు వార్తలొస్తున్నాయి. మల్కాజ్‌గిరి ఎంపి స్థానం నుండి విజయమ్మను గాని, షర్మిలను గాని దించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేవిధంగా లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ కూడా అదే స్థానం నుండి పోటీ చేసేందుకు ఉత్సుకత చూపుతున్నట్టు సమాచారం. బిజెపి తరఫున మరోసారి బరిలోకి దిగేందుకు ఇంద్రసేనారెడ్డి కూడా పావులు కదుపుతున్నట్టు వినవస్తోంది. ఇదిలా ఉంటే గతంలో పిఆర్‌పి అభ్యర్థికి భారీగా ఓట్లు రావడంతో పవన్ కల్యాణ్ బరిలో దిగేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలియవస్తోంది. టిఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య పొత్తు ఉన్నట్టయితే ప్రస్తుతం సిట్టింగ్‌లో ఉన్న సర్వే సత్యనారాయణకు అవకాశం దక్కనున్నట్టు విశ్వసనీయ సమాచారం.
మల్కాజ్‌గిరిలో..
మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం కూడా 2009లో ఏర్పడింది. సిద్దిపేట, సికింద్రాబాద్, నల్గొండ లోక్‌సభ నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలతో ఇది రూపుదిద్దుకుంది. మొత్తం ఓటర్లు.. 29,53,624 కాగా అందులో పురుషుల సంఖ్య 15,96,150.. మహిళా ఓటర్ల సంఖ్య 13,57,474మంది. ఇదిలా ఉండగా అసెంబ్లీ నియోజకవర్గం 2009లోనే ఏర్పాటైంది. ఖైరతాబాద్, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలతో ఈ నియోజకవర్గం రూపుదిద్దుకుంది. ఆకుల రాజేందర్ (కాంగ్రెస్) ప్రాతినిధ్యం వహిస్తున్నారు.




