హైదరాబాద్, మార్చి 7 : మజిద్ హుస్సేన్ తన మేయర్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని శుక్రవారం సాయంత్రం జిహెచ్‌ఎంసి కమిషనర్ సోమేష్‌కుమార్‌కు అందజేశారు. ఇదిలా ఉండగా మజిద్ స్థానంలో కొత్త మేయర్ ఎన్నికకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఒప్పందం ఇలా..
మునిసిపల్ ఎన్నికల్లో ఎంఐఎం,కాంగ్రెస్‌పార్టీలకు అధికారం చేపట్టేందుకు సరిపడ సంఖ్యలో కార్పొరేటర్ల స్థానాలు దక్కలేదు. ఎన్నికల అనంతరం ఇరు పార్టీలు మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు వంతులవారీగా నిర్వహించుకోవాలని అవగాహనకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి రెండేళ్లు కాంగ్రెస్ మేయర్‌గా బండ కార్తీకరెడ్డి, డిప్యూటీ మేయర్‌గా ఎంఐఎంకు చెందిన జాఫర్ హుస్సేన్ పదవుల్లో కొనసాగారు. మరుసటి రెండేళ్లు మేయర్‌గా మజిద్ హుస్సేన్, డిప్యూటీ మేయర్‌గా గోల్కొండ రాజ్‌కుమార్ కొనసాగుతున్నారు. అయితే ఒప్పందం ప్రకారం వారి పదవీ కాలం ఈ ఏడాది జనవరి 3వ తేదీతో ముగిసింది. గడువు ముగియడంతో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌కు లేఖ రాశారు. మేయర్, డిప్యూటీ మేయర్ తమ పదవులను వీడితే కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. చివరి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవిలో, ఎంఐఎం డిప్యూటీ మేయర్ పదవులు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా మేయర్ మజిద్ నాంపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే పదవికి బరిలో నిలువనున్నట్టు తెలిసింది.
ఎమ్మెల్యే స్థానాలపై దృష్టి
అసెంబ్లీ ఎన్నికలు రావడంతో.. ఎమ్మెల్యేల స్థానాలపై కొందరు కార్పొరేటర్లు దృష్టిపెట్టారు. ఇంకొందరు కార్పొరేటర్లయితే.. మేయర్ పదవి కోసం ప్రయత్నించాలా.. ఎమ్మెల్యే స్థానం కోసం పావులు కదపాలా అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు వెలువడడంతో.. ఎన్నికల తర్వాతే కొత్త మేయర్ ఎంపిక జరగనున్నట్టు సమాచారం. మేయర్ పదవికి కోసం కొందరు ఆశావహులు తమ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. శేరిలింగంపల్లికి చెందిన జగదీశ్వర్‌రెడ్డి, బోయినపల్లికి చెందిన నర్సింహయాదవ్, గ్రేటర్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు పేర్లు విన వస్తున్నాయి. మేయర్ రాజీనామాను సర్వసభ్య సమావేశంలో ఆమోదించాల్సి ఉంటుంది. కొత్త మేయర్ ఎన్నికను కూడా సర్వ సభ్య సమావేశంలోనే నిర్వహించాలి. కొత్త మేయర్ ఎన్నిక కోసం జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌కు లేఖ రాయాల్సి ఉంటుంది. కలెక్టర్ నిర్ణయం మేరకు మేయర్ ఎన్నిక తేదీ వెలువడుతుంది. ప్రస్తుతం జిల్లా అధికారి ఎన్నికల సన్నాహాల్లో ఉన్నందున ప్రత్యేక సమావేశం ఎప్పుడు జరుపుతారనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉండగా అధిష్టానం మాత్రం మేయర్ పదవి ఎవరికి కట్టబెడుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కౌన్సిల్‌లో పార్టీల బలాబలాలు..
కాంగ్రెస్ 51, మజ్లిస్ 43, టీడీపీ 41, బిజెపి 8, వైఎస్‌ఆర్‌సిపి 6, ఎంబిటి 1, ఎక్స్ అఫిషియో సభ్యులు 37మంది ఉన్నారు.




