గట్టెక్కించే బాధ్యత కార్యకర్తలదే
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్
హైదరాబాద్, మార్చి 15 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉందని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. శనివారం గాంధీభవన్ ప్రాంగణంలో నిర్మించిన ఇందిరా భవన్‌ను దిగ్విజయ్‌సింగ్ ప్రారంభించారు. ఈ భవనం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాల నిర్వహణకు కేటాయించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు రఘువీరారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, పనబాక లక్ష్మి, ఆనం రాంనారాయణరెడ్డి, బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం దిగ్విజయ్‌సింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉందని, దానికి గట్టెక్కించాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. ముఖ్యంగా రెండు ప్రాంతాలలో పీసీసీలను ఏర్పాటు చేయడం కొత్త అధ్యయాన్ని ప్రారంభించినట్టయిందన్నారు. రెండు ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే తన ముందున్న ప్రధాన కర్తవ్యమని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు అంగీకరించినందువల్లే కాంగ్రెస్ కూడా నిర్ణయం తీసుకోకతప్పలేదని దిగ్విజయ్ అన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన చేపట్టిందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన నేతలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని దిగ్విజయ్‌సింగ్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. మరోవైపు గాంధీ భవన్‌లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యకూడా బాధ్యతలు చేపట్టారు.
‘జనసేన’కు దశాదిశా లేదు
వెయ్యిమంది పవన్‌లు వచ్చినా ఏమీచేయలేరు
డైలాగులతో మోసం చేయాలనుకోవడం పొరపాటు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొంగులేటి
హైదరాబాద్, మార్చి 15 (ఎపిఇఎంఎస్): జనసేన పార్టీకి దశాదిశాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వెయ్యి మంది పవన్‌కల్యాణ్‌లు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరని అన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకే పవన్ పార్టీ పెట్టారన్న విషయం తెలిసిపోతున్నదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని, అయితే ఆ పార్టీ ప్రజలకు ఏమీ చేయబోతున్నదో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలు రెండు నెలల ముందు పార్టీ పెట్టి ఓట్లను చీల్చేందుకే కొత్త పార్టీలు వెలుస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇలాంటి పార్టీలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఎన్నికలకు ఆరు నెలలు, సంవత్సరం ముందు పార్టీలు పెట్టి ప్రజలకు ఏం చేయబోతున్నామో చెబితే బాధ్యతగా ఉంటుందని ఆయన అన్నారు. పంచ్ డైలాగులతో ప్రజలను మోసం చేయాలనుకోవడం పొరపాటని ఆయన అన్నారు. దేశ సమైక్యత, సమగ్రతలకు గురించి పవన్ మాట్లాడటం సిగ్గుగా ఉందన్నారు. రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదని వ్యాఖ్యానించిన పవన్ విభజన జరుగుతున్నప్పుడు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. అభిమానులను తప్పుదోవ పట్టించేవిధంగా వ్యాఖ్యనించిన పవన్ పార్టీ దిశాదశా సూచించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి పవన్‌కు లేదని పొంగులేటి మండిపడ్డారు. తాము ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి రాజకీయాలకు వచ్చామని, ప్రజల సమస్యలపై ఆందోళన చేపట్టామని పొంగులేటి అన్నారు ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను మభ్యపెట్టలేరని పొంగులేటి అన్నారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు.




