ఖమ్మం, ఏప్రిల్ 5 : ఎన్నికల్లో నిబంధనలు అతిక్రమించే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ములుగు, ఖమ్మం జిల్లా ఎన్నికల వ్యయ అధికారి జయరాజ్ ఆదేశించారు. అభ్యర్థుల వ్యయంపై అధికారులకు, సిబ్బందికి మరోసారి ప్రత్యేకంగా అవగాహన చేపట్టాలని అన్నారు. వ్యయ నమోదు విషయంలో రాజీ పడవద్దని ఆయన అన్నారు.అభ్యర్థులు ప్రచారం, నామినేషన్లు వేసే సమయంలో తప్పనిసరిగా వీడియో షూటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన వ్యయం కన్న ఎక్కువగా ఉపయోగిస్తే నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. నామినేషన్లు వేసే సమయంలో నిబంధనలు తప్పక పాటించే విధంగా అభ్యర్థులకు తగు సూచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యయాన్ని పరిశీలించే వారికి పూర్తి స్థాయిలో అవగాహన లేదన్నారు. ఎన్నికల నిబంధనల విషయంలో ఏమైనా తేడా వస్తే బాధ్యులు ఎన్నికల అధికారితోపాటు జిల్లా అధికారులే ఇబ్బంది పడతారని, ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని ఆయన తెలిపారు.




