అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు
2009 కంటే 6శాతం ఎక్కువ పోలింగ్
తెలంగాణలో 72 శాతం పోలింగ్ నమోదు: ఈసీ
హైదరాబాద్ : తెలంగాణలో 2014 సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. 2009 ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. 2009 ఎన్నికల్లో 67.71 శాతం పోలింగ్ నమోదు కాగా, 2014 ఎన్నికల్లో 72 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆయన చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 81 శాతం పోలింగ్ నమోదు కాగా, హైదరాబాద్‌లో అత్యల్పంగా 53 శాతం పోలింగ్ నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా 2 కోట్ల 10 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. తెలంగాణలో బుధవారం నాడు ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటలకు 72 శాతం పైగా పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని, అయితే ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌లవద్ద క్యూ లైన్లలో ఓటర్లు ఉంటే ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా పోలింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.తెలంగాణ వ్యాప్తంగా . 17 పార్లమెంట్, 119 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. చిన్న చిన్న చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ప్రారంభంలో పోలింగ్ మందకొడిగా జరిగినా 10 గంటల తర్వాత పోలింగ్ సరళి పెరిగింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. తెలంగాణ జిల్లాల్లో బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 72 శాతం పైగా పోలింగ్ నమోదు అయింది. నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి….
* ఆదిలాబాద్ – 78 శాతం
* నిజామాబాద్ – 70 శాతం
* కరీంనగర్ – 76 శాతం
* వరంగల్ – 75 శాతం
* మెదక్ – 77 శాతం
* మహబూబ్‌నగర్ – 73 శాతం
* ఖమ్మం – 78 శాతం
* నల్గొండ – 81 శాతం
* హైదరాబాద్ -53 శాతం
* రంగారెడ్డి జిల్లా – 60 శాతం పోలింగ్ నమోదైంది.




