
– ప్రభుత్వానికి రైతు సంఘం ప్రశ్న
– ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలి
రైతు రుణమాఫీపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికి మాఫీ అమలుపై స్పష్టత ఎందుకు ఇవ్వడంలేదని తెలంగాణ రైతు సంఘం ప్రశ్నించింది. అనావృష్టి పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోయి రైతులు ఆవేదన చెందుతున్నారని, వారికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. అన్ని పంటలకు బీమా వర్తింప చేయాలని కోరింది. ఆదివారం సంఘం రాష్ట్ర కార్యాలయంలో రైతు సంఘం ఉపాధ్యక్షులు అరిబండ ప్రసాదరావు, సభ్యులు సంజీవరెడ్డిలతో కలిసి సంఘం అధ్యక్ష, కార్యదర్శి పి జంగారెడ్డి, బొంతల రామచంద్రారెడ్డిలు విలేకరులతో మాట్లాడారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడుస్తున్నా రుణమాఫీపై ఏమాత్రం స్పష్టత ఇవ్వడంలేదని విమర్శించారు. రుణమాఫీకి అనేక షరతులు పెట్టి రైతులను గందరగోళ పరుస్తున్నారన్నారు. వ్యక్తిగత పూచిమీద లక్ష రూపాయలకు వరకు రుణం ఇవ్వాలని రిజర్వు బ్యాంకు ఆదేశించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 58,534 మంది కౌలు రైతులకు రుణార్హత కార్డులిచ్చి రూ 23.93 కోట్లు రుణం ఇచ్చారన్నారు. వీరికి ఎలాంటి పాస్‌పుస్తకాలు లేవన్నారు. వీరికి రుణమాఫీ వర్తిస్తుందా? లేదా అనే అంశాన్ని ప్రభుత్వం పేర్కొన లేదన్నారు. పండ్లతోటలు, చెరుకు, ఉద్యాన పంట రుణాలను స్వల్పకాలిక రుణాల్లో చేర్చడం దారుణమన్నారు. చెరుకు ప్యాక్టరీలు రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు రైతు ఖాతాల్లో వేయడం వల్ల రైతులకు రుణమాఫీ వర్తించదని చెబుతున్నారన్నారు. ఈ చెల్లింపు రైతుల ఆర్థిక స్థితిని బట్టి కాక ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఏకపక్షంగా తీసుకున్న చర్య అని, దీనివల్ల చెరుకు రైతు రుణమాఫీ పొందలేకపోతున్నట్లు తెలిపారు. చిన్న మొత్తంలో ఉన్న రుణాలను నగదు రూపంలో చెల్లించి, పెద్ద మొత్తంలో ఉన్న రుణాలకు హామీపత్రం ఇవ్వాలనడం సరైందికాదన్నారు. ప్రభుత్వం ఇచ్చే హామీ పత్రాన్ని బ్యాంకులు ష్యూరిటీ కింద తీసుకోవడానికి అవకాశం లేదన్నారు. దీంతో కొత్త రుణాలకు ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. రుణ అర్హత గల వారందరికి పంట బీమా ప్రీమియం చెల్లించి పంట బీమా పథకాన్ని అమలుచేయాలని కోరారు. అందుకు తగిన విధంగా బడ్జెట్లో విధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.




