మొక్కజొన్న రైతుల గోస పట్టదా

 

 

 

 

 

జాతీయ రహదారిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆందోళన

జడ్చర్ల, మే 9 (జనంసాక్షి): పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. జడ్చర్ల పత్తి మార్కెట్‌లో కొనుగోలు చేసిన మొక్కజొన్నను గోదాములకు తరలించడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ, శనివారం జడ్చర్ల – కల్వకుర్తి జాతీయ రహదారిపై గంగాపూర్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు ఆయన మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులు దాదాపు 40 రోజులుగా మార్కెట్‌లోనే పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పండించడానికి రైతు ఎంత కష్టపడతాడో, అంతకంటే ఎక్కువ కష్టాన్ని ప్రభుత్వం అమ్ముకునే దగ్గర పెట్టిస్తోందని మండిపడ్డారు. జడ్చర్ల మార్కెట్‌లో పేరుకుపోయిన 40 వేల బస్తాల మొక్కజొన్నను తక్షణమే గోదాములకు తరలించాలని డిమాండ్ చేశారు. నాగసాల గోదాం దగ్గరకు 40 ట్రాక్టర్లు తీసుకెళితే కేవలం నాలుగు మాత్రమే అన్‌లోడ్ చేయడం వల్ల మిగతా రైతులు రాత్రంతా అక్కడే ఉండాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగుబడిపై అంచనా లేకపోవడం, గన్ని బ్యాగులు, హమాలీలు, లారీలు, గోదాముల వంటి కనీస వసతులపై ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ భయంకర పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఐదు రోజుల క్రితమే అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని, ప్రజా పాలన అని చెప్పుకునే ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టడం తగదని హితవు పలికారు. ఇటువంటి చేతగాని ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, ప్రభుత్వం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు. రైతులకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.