చలో అసెంబ్లీ ఉద్రిక్తం

పలువురి అరెస్టు
హైదరాబాద్‌, మార్చి 14 (జనంసాక్షి) ఃరాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్‌ కోతలను నివారించాలని, గవర్నర్‌ ప్రసంగం అనంతరం విద్యుత్‌ సర్‌చార్జీలను పెంచుతూ ట్రాన్స్‌కో ఇచ్చిన ఉత్తర్వులను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ పది వామపక్షాలు చేపట్టిన చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన వామపక్షాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్‌ చేశారు. వామపక్షాల నేతలను అరెస్ట్‌ చేస్తున్న తీరుపై మండిపడ్డ కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి దిగడమేకాక అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈతరుణంలో   ఒకరిద్దరు పోలీసులు పడిపోవడంతో ఆగ్రహించిన ఉన్నతాధికారులు ఒక్కొక్కరిని లాక్కెల్లుకుంటూ వాహనాల్లోకి ఎక్కించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వదిలేసిన పోలీసులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ నారాయణ, సిపిఎం కార్యదర్శి బివి రాఘవులుతోపాటు 150మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఈసందర్బంగా సిపిఐ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే ఈచలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అసెంబ్లీలో ఇచ్చిన వాయిదా తీర్మాణంపై బలంగా తమ సభ్యులు చర్చించడంతోపాటు, ప్రజలకు సరైన మెసేజ్‌ను ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. విద్యుత్‌ కోతలు, ముక్కుపిండి వసూలు చేస్తున్న డబ్బుల విధానాన్ని ఎండగడుతూ ఏప్రిల్‌ నెలలో ముందుగా చెప్పిన ప్రకారం ఏప్రిల్‌ నెలలో జరిగే అసెంబ్లీని పెద్దఎత్తున అడ్డుకోవాలనే ఉద్దేశ్యంతో నిర్వహించే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ఈరోజు కార్యక్రమం ట్రయల్‌లాంటిదన్నారు. అసెంబ్లీవరకు తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలుపుకుని వెళ్లి వారిని ప్రశాంతంగా లోపలికి పంపించి సభ్యులకు బలం చేకూర్చేందుకు మాత్రమే ఈకార్యక్రమాన్ని నిర్వహించాలని చూస్తే పోలీసులు అరెస్ట్‌ చేయడం శోచనీయమన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధాన వేదికఅయిన అసెంబ్లీలో గవర్నర్‌ చేసిన ప్రసంగంలో ఏమాత్రం ప్రస్తావించకుండానే విద్యుత్‌ సర్‌చార్జీల బారాన్ని ప్రజలపై మోపుతూ రెగ్యులేటరీ కవిూషన్‌ తీసుకోవడం ఎంతవరకు సబబని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇది ప్రజల్ని, చట్టసభలను తప్పుదారి పట్టించినట్లు కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎడా పెడా పెంచుతూ పోతున్న విద్యుత్‌ చార్జీలపై తమ పోరాటంలో ఇది ఆరంభం మాత్రమేనన్నారు. అరెస్ట్‌లతో ఉద్యమాలను, ఆందోళనలను అడ్డుకుందామని చూస్తే ప్రజలే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారన్నారు. సిపిఐ ఫ్లోర్‌లీడర్‌ గుండా మల్లేశ్‌ మాట్లాడుతూ పన్నులవిూద పన్నులు వేస్తూ ప్రజలు బ్రతకకుండా చేస్తున్నది ప్రభుత్వమని ఆరోపించారు. ఓవైపు నిత్యావసరవస్తువుల ధరలు పెంచుతూ, విద్యుత్‌ చార్జీలను, మరో రూపంలో సర్‌చార్జీల పేరుతో వేలాది కోట్ల రూపాయలను ముక్కు పిండి వసూలుచేయడం శోచనీయమన్నారు. స్వాతంత్య్రం వచ్చాక రాష్ట్రంలో ఇంత పెద్దఎత్తున విద్యుత్‌కోతలు అమలు చేస్తున్నది తొలిసారేనన్నారు. ప్రభుత్వ దివాళా కోరుతనం వల్ల రాష్ట్రంలో అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయని మల్లేశ్‌ తెలిపారు. అయినా ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. సిపిఎం ఫ్లోర్‌ లీడర్‌ జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం దఫదఫాలుగా విద్యుత్‌ చార్జీలు పెంచుతున్నప్పటికి, సర్‌చార్జీల పేరుతో భారం మోపుతోందని ఆరోపించారు. ప్రభుత్వం బరితెగించి పరిపాలిస్తోందని దుయ్యబట్టారు. తాను మొండివాడినని చెప్పుకుంటున్న సిఎం తన మొండి తనాన్ని ప్రజలకు పయోగ పడేలా ఉంటే మంచిదవుతుందన్నారు. విద్యుత్‌ చార్జీలను నిలిపివేసే వరకు తమ పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు.