జనంసాక్షి, మంథని : నాటి నుంచి నేటి వరకు బ్రాహ్మణీయ పాలనలో దళిత సామాజిక వర్గానికి అవమానాలే ఎదురవుతున్నాయని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
మంథని మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. అనేక రంగాల్లో అభివృద్ది చెందుతున్న ఈ సమాజంలో కులాలు మతాలకు సంబందం లేకుండా కలిసి మెలిసి ఉంటున్న క్రమంలో కూడా మంథని దళిత కాలనీలోని దళితుల ఇండ్లలో ఏ కార్యం జరిగినా బ్రాహ్మణులు రాని దుస్థితి ఉందని ఆయన వాపోయారు. మంథని నియోజకవర్గంలో అనేక ఏండ్లు పరిపాలన చేసిన దుదిళ్ల కుటుంబ పాలనలో దళిత కాలనీపై చిన్నచూపే మిగిలిందని, ఇప్పటి వరకు ఏ ఇంటికి పురోహితులు రావడం లేదని, ఈ సమాజంలో మాదిగలు అంత ముట్టుకోని వారా అని ఆయన ప్రశ్నించారు. 40ఏండ్ల పాలనలో దుద్దిళ్ల కుటుంబం చేస్తున్న అన్యాయాలను, వ్యవహరశైలిని ప్రజలకు విమర్శిస్తుంటే నిత్యం తనను ఎంతో మంది తిడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే దుద్దిళ్ల కుటుంబానికి వత్తాసు పలుకుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు ఇకనైనా ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య మున్నూరు కాపు అని, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడని, అక్బర్‌ఖాన్ మైనార్టీ నాయకుడని వీళ్లంతా దుద్దిళ్ల కుటుంబ మాయమాటలు నమ్మి ప్రతిరోజు తనను తిడుతున్నారని, ఎందుకు వీళ్లు తిడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. తాను ఈ వర్గాలకు ఏమైనా అన్యాయం చేశానా అని ఆయన ప్రశ్నించారు. బ్రాహ్మణీయ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్యాయం జరుగుతోందని, మన ఓట్లతో అధికారం చేపట్టి అనేక పదవులు అనుభవిస్తూ వాళ్ల కుటుంబాన్ని బాగు చేసుకున్నారే కానీ మన వర్గాలకు ఏమైనా న్యాయం చేశాడా అని ఆలోచన చేయాలని ఆయన హితవు పలికారు. 2007లో టీటీడీ చైర్మన్‌గా కరుణాకర్‌రెడ్డి ఉన్నసమయంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిని దళిత గోవిందం పేరుతో దళిత వాడల్లో తీసుకెళ్లాడని, బ్రాహ్మణేతరులు ఉంటేనే ఇలాంటిది సాధ్యమవుతుందని కరుణాకర్‌రెడ్డి నిరూపించారని అన్నారు. 2007లోనే వెంకన్నస్వామిని దళిత వాడల్లోకి తీసుకెళ్తే స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లు దాటినా మంథనిలోని అంబేద్కర్ కాలనీలోని దళితుల ఇండ్లకు పురోహితులు రాని పరిస్థితులకు కారణం ఎవరో ఆలోచన చేయాలన్నారు. తండ్రి కొడుకుల పాలనలో దళితులను అంటరానివాళ్లగానే చూశారే తప్ప ఏనాడు వారి గురించి ఆలోచన చేయలేదన్నారు. మంథని ఎమ్మెల్యేకు దళితులపై చిత్తశుద్ది ఉంటే మంథనిలోని అంబేద్కర్‌నగర్‌కు దుద్దిళ్ల పురోహితులను పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. బ్రాహ్మణీయపాలన గురించి మాట్లాడితే నేను బ్రాహ్మణ కుటుంబంలో పుడుతా అనుకున్నానా అని ఎమ్మెల్యే మొసలి కన్నీరు కారుస్తున్నారని, అదే దళితులు మాదిగ కులంలో పుట్టాలని ఆ బ్రహ్మను వేడుకున్నారా అని ఆయనప్రశ్నించారు. 2007లో దేశంలోనే ప్రసిద్ది గాంచిన పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్లే దళితగోవిందం కార్యక్రమం పెట్టి స్వామివారిని దళితకాలనీలకు తీసుకెళ్తే 2023వరకు మంథనిలోని అంబేద్కర్‌నగర్ ఒక్క పురోహితుడినైనా పంపించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు లేదా అని ఆయన ప్రశ్నించారు. దళితుల ఓట్లతో గెలిచి అధికారంలో ఉంటూ దళిత కాలనీలకు ఏం చేశారో చెప్పాలని, ఎంత మంది దళితులకు ఇండ్లు కట్టిచ్చారో చెప్పాలని ఆయన ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. 40ఏండ్లలో అధికారంలో ఉన్న దుద్దిళ్ల కుటుంబం ఏ వర్గానికి మేలు చేయలేదని, కేవలం పదవుల కోసమే ఆరాటపడ్డారే కానీ అట్టడుగు వర్గాల గురించి ఆలోచన చేయలేదని ఆయన విమర్శించారు. చదువుకున్న విజ్ఞానవంతులని దళితులు మీకు ఓట్లు వేస్తే వాళ్లను అంటరానీవాళ్లుగానే చూడటం న్యాయమా అని ఆయన అన్నారు. నియోజకవర్గంలో అనేక ఏండ్ల బ్రాహ్మణీయ పాలనలో జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంటే ప్రజలకు అర్థం కావడం లేదని, పదేపదే చెబుతున్నా చర్చించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం మా సారు మంచోడని భజన చేసే కాంగ్రెస్ పార్టీలోని ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనార్టీ నాయకులు ఆలోచన చేయాలని, దళితుల ఇండ్లకు పురోహితులు ఎందుకు పోవడం లేదని ప్రశ్నించాలని ఆయన సూచించారు.
అంటరాన్నితనాన్ని రూపుమాపాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు లేదా జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్




