ఇటిక్యాల (జనంసాక్షి) మే 26 : ప్రజల మన్ననలు పొందేలా పోలీసులు విధులు నిర్వర్తిస్తూ అందరికీ అందుబాటులో ఉండాలని, సైబర్ నేరాలు, మూఢ నమ్మకాలు, బాల్య వివాహాలపై గ్రామ పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని గద్వాల జిల్లా డిఎస్పి ఎన్. సిహెచ్. రంగస్వామి అన్నారు. శుక్రవారం వార్షిక తనిఖీల్లో భాగంగా ఇటిక్యాల మండల కేంద్రంలో ఉన్న పోలీసు స్టేషన్ ను డిఎస్పి సందర్శించి స్టేషన్ రికార్డులు, స్టేషన్ పరిసరాలు, పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్.హెచ్.వో, లాక్ అప్, మెన్ రెస్ట్ రూం తదితర ప్రదేశాలను పరిశీలించారు. స్టేషన్ లో రోజువారీగా నిర్వహిస్తున్న జనరల్ డైరీ, సెంట్రీ రిలీఫ్ బుక్, డ్యూటీ రోస్టర్, విలేజ్ రోస్టర్, ప్రాసెస్ రిజిస్టర్, బీట్ డ్యూటీ బుక్స్, సస్పెక్ట్ చెక్ రిజిస్టర్, సుపీరియర్ ఆఫీసర్స్ విసిటింగ్ బుక్స్, ఫైనల్ రిపోర్ట్స్ తదితర రికార్డులను ఆయన తనిఖీ చేశారు. గ్రామాల్లో మోనిటర్ కమిటీ ఆధ్వర్యంలో నిషేధిత గంజాయి, గుట్కా, గుడుంబా, గ్యాంబ్లింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా పోలీసు సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్టికల్ వారిగా అధికారులు సిబ్బంది విధులు నిర్వహించాలని ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని ఫిర్యాదుదారులందరికీ ఒకే రకమైన సేవలు అందించాలని సూచించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజలతో సత్సంబంధాలు మరింత పెంపొందించుకుని శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. రోజు వారి డీడీ, ఈ పెట్టీ కేసుల నమోదు శాతాన్ని పెంచాలని అన్నారు. తరచూ ప్రాపర్టీ, మానవ సంబంధ నేరాలకు తరచూ పాల్పడే వారి పై సస్పెక్ట్, రౌడీ షీట్స్ ఓపెన్ చేయాలని, స్టేషన్ రికార్డ్స్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని, ఇసుక, పిడిఎస్ రైస్, నకిలీ సీడ్స్, అక్రమ రవాణా పై పూర్తి నిఘా ఉంచి వాటిని నియంత్రించాలని, విజిబుల్ పోలీసింగ్ ను పెంచాలని సూచించారు. ప్రతి రోజు పోలీసు సిబ్బంది సమయం దొరికినప్పుడు వ్యాయామం, యోగ, ధ్యానం, వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నీట్ టర్న్ అవుట్ కలిగి ఉండి, మంచి క్రమశిక్షణ సమయపాలన పాటించాలని లీడర్షిప్ లక్షణాలు కలిగి ఉండాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో 5ష్ ఇంప్లిమెంటేషన్ ని పరిశీలించి ఫైలు సక్రమమైన పద్ధతిలో ఉంచాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏ తరహా కేసులు ఎక్కువ నమోదయ్యాయని అడిగి తెలుసుకున్నారు. గత మూడు సంవత్సరాల నుండి నమోదవుతున్న కేసుల గురించి కంపారిటివ్ స్టేట్మెంట్ ను పరిశీలించి మరియు అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సిడి ఫైల్స్ ను, పెండింగ్ ట్రాయల్లో ఉన్న సిడి ఫైళ్లను, గ్రేవ్ కేసెస్ లలో ఉన్న సిడి ఫైళ్లను పరిశీలించారు. రౌడీలు, కేడీలు, సస్పెక్ట్స్ మరియు సంఘ విద్రోహ శక్తులపై నిరంతరం నిఘా ఉంచి, వారి కదలికలను గమనించాలని తెలిపారు. రాత్రి పెట్రోలింగ్ అధికారులు పాత నేరస్తులను తనిఖీ చేయాలని ఎస్సై కు సూచించారు. విధినిర్వహణలో రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని సూచించారు. ప్రజల రక్షణ గురించి ఎల్లవేళలా అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇంస్టిగేషన్ ఉండాలని కేసులలో శిక్షల శాతం పెంచాలని సూచించారు. అధికారులు సిబ్బంది ప్రొయాక్టివ్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని డిఎస్పీ తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లో ప్రజల కోసం పోలీసులు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి నెలలో నాలుగు సార్లు వేర్వేరు గ్రామాల్లో ఇన్ స్పెక్టర్, ఎస్.ఐ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటారని తెలిపారు. యువత కోసం యాంటీ గాంజా డ్రైవ్ కార్యక్రమాన్ని తీసుకున్నామని తెలిపారు. గాంజా అక్రమంగా రవాణా చేసినా, సేవించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. యువత చదువుపై దృష్టి సారించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి పలు కేసుల్లో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను అభినందించారు.ఈ తనిఖీల్లో పోలీస్ సిబంది ఇటిక్యాల ఎస్సై గోకారి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




