Wednesday, 4 November 2026

ధాన్యం తరలింపులో రైతులకు ఇబ్బంది ఉండొద్దు – రైస్‌ మిల్లర్లు సంపూర్ణ సహకారం అందించాలేవెంకటాపూర్‌…మంథని గోదాంలలో నిల్వ చేయండి

జనంసాక్షి, మంథని : ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం బస్తాల తరలింపులో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ అన్నారు. శుక్రవారం మంథనిలోని ఏఎంసీ మార్కెట్‌ యార్డులోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ధాన్యం తరలింపుపై జిల్లా సివిల్‌ సప్లై అధికారులతో మాట్లాడారు. త్వరితగతిన ధాన్యం తరలింపుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైస్‌మిల్లర్లు సైతం సంపూర్ణ సహకారం అందించి ధాన్యం దించుకోవాలన్నారు. మిల్లుల్లో ధాన్యంనిల్వలు ఎక్కువైతే గోదాంలకు తరలించి నిల్వ చేయాలన్నారు. మంథనితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని కేంద్రాల నుంచి ధాన్యం బస్తాలను మంథనిలోని గోదాంకు తరలించాలని, అలాగే వెంకటాపూర్‌ సమీప గ్రామాల కేంద్రాల నుంచి వెంకటాపూర్‌ గోదాంలో నిల్వ చేయాలని అధికారులను సూచించారు. ధాన్యం తరలింపు విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఈ క్రమంలో ప్రతి ఒక్కరు సహకారం అందించాలని ఆయన ఈ సందర్బంగా కోరారు.