అంబేద్కర్ అధ్యయనంతో కూడిన మేధోతనం నుంచి విద్యార్థులు స్ఫూర్తిపొందాలి.
– సిఓఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు.
బెల్లంపల్లి, డిసెంబర్ 6, (జనంసాక్షి )
ప్రపంచ మేధావి గొప్ప అధ్యయన శీలి బాబాసాహెబ్ అంబేద్కర్ దినచర్య నేటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ బెల్లంపల్లి ప్రిన్సిపల్ ఐనాల సైదులు అన్నారు. మంగళవారం బెల్లంపల్లి సిఓఈలో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. బాబా సాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
చదువుతో ప్రారంభమై చదువుతూ రోజును ముగించే బాబాసాహెబ్ దినచర్య ఉన్నతమైనదన్నారు. ఉత్తమమైన అధ్యయనం ద్వారా సంపాదించిన తన మేధస్సుతో బాబాసాహెబ్ చేసిన ప్రసంగాలు, రాసిన పుస్తకాలు ప్రపంచ గమనాన్ని మార్చాయన్నారు.
అంబేద్కర్ కి ముందు భారతదేశ చరిత్ర గురించి , భారతదేశంలోని జాతుల సమస్యల గురించి సరైన అవగాహన ప్రపంచానికి లేదనీ, అంబేద్కర్ తన పరిశోధనాత్మక వ్యాసాల ద్వారా భారతదేశంలో కులాలు, వాటి పుట్టుక , పరిణామం పై శాస్త్రీయ పద్ధతిలో వివరించి ప్రపంచంలోని మేధావులను సైతం ఆకర్షించారు. అంబేద్కర్ విద్యార్థి దశ నుండి పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవడం ఫలితం గానే తన చుట్టూ ఉండే ప్రతి సమస్యకు శాస్త్రీయమైన పరిష్కారాలను తన ప్రసంగాల ద్వారా, వ్యాసాల ద్వారా సమాజానికి సూచించారన్నారు. ప్రతి సమస్యను శాస్త్రీయ దృక్పథంతో అర్థం చేసుకునే విధానాన్ని ఈ దేశానికి బాబాసాహెబ్ ఇచ్చిన గొప్ప వరం అని ఆయన అన్నారు.
గొప్ప అధ్యయనంతో కూడిన అంబేద్కర్ రచనలు నేటికీ ప్రపంచవ్యాప్తంగా సజీవంగా అనేక సమస్యలకు దారి చూపడం ఆయన ప్రతిభకు నిదర్శనం అన్నారు. సమాజంలోని సామాజిక , చారిత్రక, ఆర్థిక, రాజకీయ సమస్యలకు అంబేద్కర్ రచనల్లో సమాధానం దొరుకుతుందన్నారు. నిరంతరం పుస్తకాలను చదవడం, సమస్యల్ని లోతుగా అర్థం చేసుకోవడం తోపాటు పరిష్కరించే దిశగా ఆలోచించడమే అంబేద్కర్ ను ప్రపంచ మేధావిగా నిలబెట్టిందన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు సమాజంలోని మేధావులు రాసిన రచనలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రపంచంలోని ఎక్కువ పుస్తకాలున్న అతిపెద్ద లండన్ గ్రంథాలయాన్ని సందర్శించి దానిలోని పుస్తకాలన్నింటినీ చదివిన ఏకైక భారతీయుడుగా బాబాసాహెబ్ ఉండడం భారతీయులకు గర్వకారణం అన్నారు. సమాజంలోని ప్రతి జఠిలమైన సమస్యకు అంబేద్కర్ నాడే పరిష్కారం చూపించారన్నారు. ఏ సమస్య వచ్చినా అంబేద్కర్ రచనలో సమాధానం దొరుకుతుందని ఆ దిశగా విద్యార్థులు అధ్యయనం చేయాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అంబేద్కర్ జీవితమే గొప్ప త్యాగశీలతకు ఉదాహరణ అన్నారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్, ఉపాధ్యాయులు కొక్కుల రాజేశ్వర్, పొన్నం శ్రీనివాస్, దుర్గం రమాదేవి, కామెర ప్రేమలత, యాంసాని హారిక, సభియాభాను, శ్యాంసుందర్ రాజు, భోగ అశోక్, మిట్ట రమేష్, ఆకినేపల్లి రాజేష్, గాజుల రాజేందర్, చందా లక్ష్మీనారాయణ,కట్ల రవీందర్, అనుముల అనిరుద్, సజ్జనపు విజయ్, అవునూరి రవి, తదితరులు పాల్గొన్నారు




