Thursday, 5 November 2026

అంబేద్కర్ జయంతి రోజే సచివాలయం ప్రారంభించాలి.

 

జనవరి17(జనం సాక్షి): సిద్దిపేట
హైదరాబాదులో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని అంబేద్కర్ జయంతి రోజే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట ఇంచార్జ్ తాడూరి శ్రీనివాస్ గౌడ్ ,ఎస్సీ సెల్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బొమ్మల యాదగిరి, పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ డిమాండ్ చేశారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పేరుకు మాత్రమే సచివాలయానికి అంబేద్కర్ పెట్టారని ఆయన ఆశలకు అనుగుణంగా అంబేద్కర్ జయంతి రోజే సచివాలయం ప్రారంభించాలన్నారు. అలాంటి మహోన్నత సచివాలయాన్ని కెసిఆర్ జన్మదినం రోజున ప్రారంభించడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం పార్టీ మనుగడ కోసం పాటుపడుతున్నదని ఎద్దేవా చేశారు. సభ సమావేశాలపై ఉన్న శ్రద్ధ సంక్షేమంపై లేదని మండిపడ్డారు. కేంద్రంలో బిజెపి పాలన, రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనపై ప్రజలు మండి పడుతున్నారని అన్నారు. బిజెపి, బీఆర్ఎస్ పార్టీలను వచ్చే ఎన్నికల్లో ప్రజలు బొంద పెట్టడం ఖాయం అన్నారు. కేంద్రంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో బీఅర్ఎస్ సభకు వస్తున్న నాయకులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులతో వెండి వీణలు చేయించడం ఎంతవరకు సమంజసం అన్నారు. రాష్ట్ర ప్రజల నుంచి తీసుకున్న డబ్బులను సంక్షేమంపై పెట్టాల్సింది పోయి ఆ పార్టీ కోసం వెచ్చిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పిసిసి సెక్రెటరీ దేవలపల్లి యాదగిరి, ఓబీసీఎల్ జిల్లా అధ్యక్షుడు సూర్య వర్మ పాల్గొన్నారు