హైకోర్టు తీర్పుతో మూసుకుపోయిన దారులు
తదుపరి చర్యలెలా ఉన్నా పూట గడవడం కష్టమే
హైదరాబాద్,నవంబరు19(జనం సాక్షి): తమ డిమాండ్ల సాధన కోసం నెలన్నరగా సమ్మె చేస్తోన్న ఆర్టీసీ కార్మికులు డిఫెన్స్ లో పడినట్లు కనిపిస్తోంది. హైకోర్టు ఆదేశాలతో వ్యవహారం లేబర్ కోర్టుకు చేరింది. దీంతో సమ్మెపై ఎలా ముందుకు వెళ్లాలన్నది అగమ్య గోచరంగా తయారయ్యింది. ప్రభుత్వంతో ఉన్న దారులు కూడా మూసుకుపోవడంతో ఇప్పుడు కార్మికుల పరిస్తితి అగమ్య గోచరంగా తయారయ్యింది. నిన్నమొన్నటివరకు ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డ హైకోర్టు ఒక్కసారిగా వ్యవహారం లేబర్ట్ కోర్టు చూస్తుందని చెప్పడంతో ఆర్టీసీ జేఏసీతో పాటు, విపక్షాలు కూడా కంగుతినక తప్పలేదు. హైకోర్టు తాజా వ్యాఖ్యలతో ఆర్టీసీ కేసు కీలక మలుపు తిరిగినట్లయ్యింది. అయితే, హైకోర్టు తాజా వ్యాఖ్యలు… ప్రభుత్వానికి కొంత సానుకూలంగా ఉండటంతో… ఆర్టీసీ కార్మిక జేఏసీ సమ్మెపై పునరాలోచనలో పడింది. అప్పటికప్పుడు సడన్ బంద్ ను వాయిదా వేసుకోవడంతోపాటు…. సమ్మె కొనసాగింపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆర్టీసీ సమ్మె విషయంలో ఎవరికీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు వ్యాఖ్యానించడంతో ఆర్టీసీ జేఏసీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇక, అటు ప్రభుత్వం… ఇటు యూనియన్ల మధ్య నలిగిపోతున్న ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగి నెలన్నర దాటుతోన్నా… ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షనూ లేకపోవడంతో… కార్మికుల భవిష్యత్తుపై గందోరగోళం నెలకొంది. జీతాలు లేక పస్తులతో కాలం గడుపుతున్న కార్మికులకు దిక్కుతోచకుండా అయ్యింది. మరోవైపు, తమ ప్రధాన డిమాండైన ఆర్టీసీ విలీనాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టినా…. ప్రభుత్వం కఠిన వైఖరి వీడకపోవడంపై కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం కమిటీ వేస్తే…. సమ్మెపై పునరాలోచిస్తామని హైకోర్టుకు తెలిపింది. అయితే, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేమని మరోసారి హైకోర్టుకు తేల్చిచెప్పింది ప్రభుత్వం. ఆర్టీసీ కార్పొరేషన్ పరిస్థితి అస్సలు బాగోలేదని, సమ్మె కారణంగా మరింత నష్టం జరిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులతో చర్చలు జరపలేమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఆర్టీసీ విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కకు-పెట్టినా… తిరిగి ఏక్షణమైనా మళ్లీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశముందని కోర్టుకు వివరించింది. సమ్మె లీగలో… ఇల్లీగలో చెప్పే అధికారం …లేబర్ కోర్టుకు మాత్రమే ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తమ పరిధి దాటి సమ్మె చట్ట విరుద్ధమంటూ ఆదేశించలేమని తేల్చిచెప్పింది. మరోవైపు, ప్రభుత్వంతో చర్చలకు కమిటీ వేయాలన్న ఆర్టీసీ జేఏసీ విజ్ఞప్తికి కూడా కోర్టు నో చెప్పింది. అయితే, రెండు వారాల్లోగా సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని కార్మికశాఖ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.




