Thursday, 5 November 2026

అణగారిన వర్గాల విజ్ఞాన జ్యోతి – మహాత్మ జ్యోతిరావ్ పూలే యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్

 

 

 

 

 

 

 

 

వీణవంక ఏప్రిల్ 11 (జనం సాక్షి ) వీణవంక మహాత్మ జ్యోతిరావు పూలే  రెండువేల ఏండ్ల నుండి అనగారిన వర్గాల ప్రజలను పట్టిపీడిస్తున్న మనువాద గులంగిరిని రూపుమాపి, సమాజాన్ని మార్చాలనే తన ఆశయం కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుందని నమ్మి, ఆధునిక భారతదేశ చరిత్రలో అనగారిన వర్గాలకు విద్యా వ్యాప్తి కోసం ఆజన్మాంతం ఆదిపత్య వర్గాలతో అక్షర యుద్ధం చేసిన అలుపెరుగని అక్షర యోధుడు, సామాజిక సంఘసంస్కర్త, సామాజిక తత్వవేత్త, మహనీయుడు మహాత్మ జ్యోతిరావ్ పూలే. కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురిచేస్తూ,వారి ఆర్థిక, సామాజిక అణచివేతకు కారణమైన కృత్రిమ కుల వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించడం  కోసం అక్షరాలని ఆయుధంగా చేసుకొని సమాజంలోని అణగారిన వర్గాలైన గ్రామస్తులు, రైతులు, కార్మికులు, మహిళలలో ఆత్మస్థైర్యాన్ని నింపి,వారి సాధికారతకై, మానవ హక్కులు కల్పించడం కోసం నిరంతరం కృషి చేశారు. అణగారిన వర్గాలకు విద్యనందించి, వారిపై అగ్రవర్ణాలు కొనసాగిస్తున్న దురాగతాలను నిరోధించడానికి 1873, సెప్టెంబర్ 24న సత్యశోధక్ సమాజ్ స్థాపించారు. సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని భావించి, మానవహక్కులు తన ఇంటి నుండి ప్రారంభం కావాలని నిరక్షరాష్యురాలైన తన సహచరి సావిత్రిబాయి పూలే కు విద్యాబుద్ధులు నేర్పి,1848 లో దేశ చరిత్రలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను పూణే లో స్థాపించి ఆనాటి సామాజిక అవరోధాలకు సవాలను విసిరారు. 1855లో శ్రామిక ప్రజల కోసం రాత్రి బడిని ప్రారంభించారు. 1864లో బాల హత్య ప్రతిబంధక్ గృహ “స్థాపించి వితంతువులైన గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచి, శిశు హత్యలను నివారించారు. బాల్యవివాహాల నివారణకు ప్రత్యేక చొరవ తీసుకొని, వితంతువులకు శిరోమండలం చేయకుండా క్షురకులను ఒప్పించారు. మలినమైన మానవ మస్తిష్కాలను తన అక్షరాలతో శుభ్రపరిచి అజ్ఞానపు బానిసత్వ ఆనవాళ్లు ఉన్న నాటి సమాజంలో తన సామాజిక తాత్వికచింతన ద్వారా సమ సమాజ వికాసం కోసం పరితపించారు. సమానత్వపు  ఆకాంక్ష, మానవ విలువల పెంపుదల లక్ష్యంగా ప్రకటించుకుని పీడిత ప్రజల అభ్యున్నతికి అహర్నిశలు పాటుపడ్డ మహనీయుడు మహాత్మ జ్యోతి రావ్ పూలే.