వరంగల్ బ్యూరో, జూన్ 13 (జనం సాక్షి) అతను గొంతు విప్పితే మధురమైన పాటలు పరవాళ్ళు తొక్కుతాయి.. ఆహుతుల మనసును రంజింపచేస్తాయి.. అందుకే అతనిని జూనియర్ బాలసుబ్రహ్మణ్యం గా అందరూ పిలుస్తారు. చిన్ననాటి నుండి పాటే ప్రాణంగా పెట్టుకుని తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు వరంగల్ నగరంలోని లేబర్ కాలనీకి చెందిన గాయకుడు కొలిపాక దేవేందర్. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కొలిపాక దేవేందర్ మంచి గాయకుడిగా పేరుంది. దేవేందర్ 1998 నుండి కొన్ని వేల కార్యక్రమాలలో పాటలు పాడుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో తన జానపదాలతో జనాన్ని ఉర్రూతలూగించారు. లింగాల ప్రేమ్ కుమార్ సినీ మ్యూజిక్ డైరెక్టర్ వద్ద సంగీత ఓనమాలు నేర్చుకొని పాటనే తన ప్రాణంగా 2022లో గాన గంధర్వ నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ ఫోక్ ఫెస్టివల్ 2022 సకల కళ సంస్కృతిక మండల వారిచే మరియు మెగా ఫాన్స్ అసోసియేషన్స్ వారిచే కాకతీయ మెగాసేవ కళా రత్న 2021 అవార్డు అందుకున్నారు. తను పాట పాడితే మన ముందే బాలు పాడుతున్నట్లుగా వారి అభిమానులు మరియు సంగీత ప్రేమికులు అంటారు. పాటలనే తన జీవన వృత్తిగా వరంగల్లోనే కాదు, మన తెలుగు రాష్ట్రాలలో తన కళాబృందంతో దాదాపు 3 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి వారు మరియు వారితో పాటు వారి కళాబృందానికి ఒక మార్గదర్శకునిగా నిలుస్తున్నారు. పాటలే జీవంగా పాటలే పరమావధిగా భావిస్తూ ఎన్నో రకాల పాటలను అలవోకగా మధురంగా విన సొంపుగా పాడుతున్న కొలిపాక దేవేందర్ భవిష్యత్తులో మరింత గొప్ప గాయకుడిగా ఎదగాలని అతనిని అందరూ ఆదర్శంగా తీసుకునే విధంగా ముందుకు సాగాలని ఆశిద్దాం
అతనికి పాటంటే ప్రాణం




