Wednesday, 4 November 2026

అత్త మామల వేధింపులు తాళలేక .. – యువకుడి ఆత్మహత్య

అత్త మామల వేధింపులు తాళలేక ..
– యువకుడి ఆత్మహత్య.
– అత్తింటి వారి వేధింపులే కారణమంటున్న బాధిత కుటుంబీకులు.
– పెళ్లి జరిగి ఆరు నెలలు దాటకముందే ఆత్మహత్య.
ఊరుకొండ, డిసెంబర్ 10 (జనంసాక్షి):
పెళ్లి జరిగి ఆరు నెలలు దాటకముందే .. కట్టుకున్న భార్య, అత్తమామలు పెట్టిన వేధింపులు తాళలేక ఓ నిండు ప్రాణం బలి అయిన సంఘటన ఊరుకొండ మండల పరిధిలోని గుడిగానిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిగానిపల్లి గ్రామానికి చెందిన పోలె బాలమణి రాములు దంపతుల చిన్న కుమారుడు పోలె అంజనేయులు(25) కు, తాడూరు మండలం శిరసవాడ గ్రామానికి చెందిన జల్లి లక్ష్మమ్మ చిన్నయ్య దంపతుల పెద్ద కూతురు శివమ్మతో 2022 ఆగస్టు 21న వివాహం జరిగింది. సాగుతున్న దాంపత్యంలో అర్ద తులం బంగారం విషయంలో ప్రారంభమైన గొడవ ప్రాణం పోయేవరకు కొనసాగింది. పెళ్లిలో పెట్టిన బంగారు ఉంగరం (బటువు) లేదని.. అట్టి బంగారు ఉంగరం తెస్తేనే సరి.. లేదంటే నేను చనిపోతానని భార్య శివమ్మ.. కచ్చితంగా తేవాలని అత్తమామలు పలుమార్లు ఆంజనేయులు ఇంటికి వచ్చి నానా గొడవ చేయడం పరిపాటిగా మారింది. శనివారం ఆంజనేయులు మామ గుడిగానిపల్లికి వచ్చి బంగారు ఉంగరం కావాలని పట్టు పట్టడంతో.. మస్తాపానికి గురైన ఆంజనేయులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు(మోన కొటో పాస్) తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పురుగుల మందు సేవించిన ఆంజనేయులును స్థానికులు కుటుంబీకులు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స అందక ముందే తిరిగిరాని లోకాల కెళ్ళాడని కుటుంబీకులు రోదిస్తూ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. తన కొడుకు చావుకు కారణమైన భార్య అత్తమామలపై మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.