Wednesday, 4 November 2026

అత్యవసర సమయంలో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ సేవలు

ఇంద్రవెల్లి జనవరి 23 (జనం సాక్షి)
ఇంద్రవేల్లి : అత్యవసర సమయంలో, విపత్కర పరిస్థితుల్లో రాపిడ్‌ యాక్షన్‌ఫోర్స్‌ సేవలు అందిస్తుందని ఉట్నూర్ సీఐ సైదారావు అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణతో పాటు అంబేద్కర్ చౌక్ వద్ద రాపిడ్‌ యాక్షన్‌ఫోర్స్‌ బెటాలియన్‌ అధికారులు, పోలీసులు కమ్మూనిటీ పోలీసింగ్‌, మాబ్‌ కంట్రోల్‌ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాపిడ్ యాక్షన్‌ఫోర్స్‌ అనేది విపత్కర పరిస్థితులు, అత్య వసర సమయంలో స్థానిక పోలీసులకు అండగా ఉండి సేవలు అందిస్తుందని తెలిపారు. రాపిడ్‌యాక్షన్‌ఫోర్స్‌ ప్రజల్లో ధైర్యం నింపి ఆత్మవిశ్వాసం పెంపొందేలా కృషి చేస్తుందని అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేలా ఈ రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ అవగాహన సదస్సులు జరిపి కవాతు నిర్వహిస్తుందని తెలిపారు. ముందుగా మండల కేంద్రంలో రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ సిబ్బంది కవాతు నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎఫ్‌ఏ అసిస్టెంట్‌ కమాండెంట్‌ శ్రీశాంత్, బీక్రమ్, ఎస్సై సునీల్, తదితరులు పాల్గొన్నారు