వరంగల్ బ్యూరో, మే 28 (జనం సాక్షి) ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము అంటూ కలుసుకున్నారు. గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి.. అని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ఖిలా వరంగల్ హై స్కూల్ లో 1978 -79 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని వైభవంగా నిర్వహించారు. 44 సంవత్సరాల తర్వాత ఒకే చోట తమ కుటుంబ సభ్యులతో కలిసి సమావేశం అవడం ఒక అద్భుతంగా చెప్పవచ్చు. ఆనాడు కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు తాము ఏ ఏ రంగాలలో ఉన్నారు, తమ పిల్లలు తమ కుటుంబాన్ని నేపథ్యాన్ని ఒక్కరొకరుగా వివరించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఆనాటి పాఠశాల ఉపాధ్యాయులను స్మరించుకోవడమే కాకుండా వారిని ఘనంగా సన్మానించి సత్కరించారు. వారికి పాదాభివందనాలు చేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు అంతా కలిసి భోజనం చేశారు. తాము 44 సంవత్సరాల క్రితం చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం తమ వంతు సహాయం అందించారు. ప్రతి ఏటా ఇలాగే కలుసుకోవాలని పూర్వ విద్యార్థులు తీర్మానించారు. అనంతరం ఆటపాటలతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ బాధ్యులు, అధ్యక్షులు బండి కోటేశ్వరరావు, బెల్లంకొండ రమేష్, వేల్పుల రవీందర్, పాలకుర్తి సత్యనారాయణ, గుర్రం రవీందర్ బాబు, నాగవెల్లి సుదర్శన్, తాళ్లపల్లి రవీందర్, సంపత్ కుమార్ లతోపాటు ఆనాడు తమకు పాఠాలు నేర్పిన ఉపాధ్యాయులు నాగభూషణం, ఉపేందర్, మొగిలి, ఐలయ్య, వెంకట్రావు, నరసయ్య, శైలేందర్, వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




