జనం సాక్షి /కొల్చారం మండలంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ నాన్ అక్రిడేషన్ జర్నలిస్టులు చేపట్టిన నిరాహార దీక్షలు బుధవారం రెండో రోజుకు చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్ తరఫున డి పి ఆర్ ఓ శాంతికుమార్ కొల్చారం వచ్చి నిరాహార దీక్షలను విరమించాలని కోరారు. నాన్ అక్రిడేషన్ జర్నలిస్టులకు రెండో విడతలో ఇళ్ల స్థలాలు ఇస్తామని తహశీల్దార్ ఆద్వర్యంలో మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అందుకు దీక్షలు చేస్తున్న జర్నలిస్టులు ఒప్పుకోలేదు. విలేఖరులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వటానికి సరిపడేంత స్థలం ఉన్నట్లు అధికారుల నుండి సమాచారం ఉందని, స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు కూడా వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, దారిద్రరేఖకు దిగువన ఉన్నవారికి ఇచ్చే జీవో ప్రకారం ఇంటి స్థలాలు కేటాయించినప్పుడు కొంతమందికి మొదటి విడతలో, మరి కొంతమందికి రెండవ విడుతలో ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. తమకు రాతపూర్వక హామీ ఇవ్వాలని కోరగా అందుకు తాసిల్దార్ ససేమీరా అన్నారు. ఈ విశయమై నిరాహార దీక్షలు చేస్తున్న జర్నలిస్టులకు, డి పి ఆర్ ఓ కు కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. జర్నలిస్టులుగా పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు అందరికీ ఒకేసారి ఇంటి స్థలాల పట్టాలు ఇస్తేనే విరమిస్తామని తెలిపారు. దాంతో ఆయన కలెక్టర్ సీరియస్ గా ఉన్నారని, కొల్చారం మండలంలో జర్నలిస్టులు ఎవ్వరికి ఇళ్ల పట్టాలు రావని చెప్పి వెళ్లిపోయారు. ఇది ఇలా ఉండగా నాన్ అక్రిడేషన్ జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి జర్నలిస్టులకు ఇంటి స్థలాల విషయమై ఇప్పటికీ ఎలాంటి మార్గదర్శకాలు రాకున్నా, దారిద్రరేఖకు దిగువనున్న వారికి ఇచ్చే జిఓ కింద ఇళ్ల స్థలాలు ఇస్తున్నప్పుడు అక్రిడియేషన్, నాన్ అక్రిడేషన్ అంటూ విభజించడంలో ఆంతర్యం ఏమిటన్నారు. కొల్చారం మండల వ్యాప్తంగా సుమారు 36 మంది వివిధ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మరియు యూట్యూబ్ లో జర్నలిస్టు లందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలన్నారు. జర్నలిస్టులకు ఇంటి పట్టాల విషయంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారులు గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. ఇప్పటికైనా తహసిల్దార్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలన్నారు. లేకుంటే అధికారుల తీరు పట్ల కుటుంబ సభ్యులను తీసుకుని వచ్చి తహసిల్దార్ కార్యాలయ ఎదుట దీక్షలు చేస్తామని తెలిపారు. ఈ నిరాహార దీక్షలో ఎండుగుల నవీన్, సిద్దు, పురుషోత్తం, చింతల గారి రమేష్, శ్రీశైలం, ప్రవీణ్, దుర్గ పతి, వడ్డెర రాజు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.




