Wednesday, 4 November 2026

అధికార పార్టీలో లుకలుకలు..ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ  అసమ్మతి  కి తెర తీశారా మండల బి ఆర్ఎస్ లో  అసమ్మతా? లేకుంటే నియోజకవర్గ  అగ్ర నాయకుల ఆధిపత్య పోరా… 

 

 

 

 

 

 

 

 

 

జనం సాక్షి   కొల్చారం మండల  బి ఆర్ ఎస్ పార్టీలో  ఆధిపత్య పోరు కొనసాగుతుందా?  బి ఆర్ ఎస్ పార్టీ  నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం రోజు నుంచి మండల బి ఆర్ ఎస్ పార్టీలో  లకలుకలు  ఒక్కొక్కటిగా  వెలుగులోకి వస్తున్నాయి. పైకి మాత్రం ఒక్కటిగా ఉన్నట్లు మేకపోతు గాంభీర్యం  ప్రకటిస్తున్న  నాయకులు, ప్రజాపత్రినిధులు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ  అసమ్మతి  కి తెర తీశారా?.. అసలు మండల బి ఆర్ఎస్ లో  అసమ్మతా? లేకుంటే నియోజకవర్గ  అగ్ర నాయకుల ఆధిపత్య పోరా… ముదిరాజ్ కులంలో  ఇద్దరు మండల స్థాయి  ప్రజా ప్రతినిధుల మధ్య ఆధిపత్య  పోరా? వివరాల్లోకి వెళ్తే  కొల్చారం మండల టిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం  ఈ నెల 9వ తేదీన  పోతంశెట్టి పల్లి  చౌరస్తాలోని హనుమమ్మ గార్డెన్లో  మండలం బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు  రాంపల్లి గౌర్శంకర్ గుప్తా అధ్యక్షతన జరిగింది. ఎనగండ్ల సర్పంచ్ దమ్మన్న గారి వీరారెడ్డి ఆత్మీయ సమ్మేళనం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు.  అదే రోజు సాయంత్రం మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరిశంకర్ గుప్తా తీరు పట్ల బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆత్మీయ సమ్మేళనానికి ఒకరోజు ముందు వరిగుంతం గ్రామంలో  దళిత సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్  విగ్రహావిష్కరణ జరిగింది. విగ్రహావిష్కరణ శిలాఫలకంపై మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కోరబోయిన మంజులా కాశీనాథ్  పేరు లేదు. దీంతో ప్రోటోకాల్ పాటించకుండా రాజకీయంగా తనను అణిచి వేయడానికి కుట్ర జరుగుతుందని  ఎంపీపీ శనివారం ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి  ప్రకటించారు. కాగా మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, ఎంపీపీ మంజుల కాశీనాథ్  ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి వర్గీయులు కాగా, ఎనగండ్ల సర్పంచ్ దమ్మన్న గారి వీరారెడ్డి, జెడ్పిటిసి ముత్యంగారి మేఘమాల సంతోష్ కుమార్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి వర్గీయులు కావడంతో ఎన్నికల సమీపిస్తున్న వేళ  అగ్ర నాయకుల సూచనలతోనే  వారి వారి వర్గీయులు  ఇలాంటి చర్యలు చేస్తున్నారా?  అనేది  వేయినోళ్ల ప్రశ్న. మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు  గౌరీ శంకర్ గుప్తా, ఎంపీపీ  మంజుల కాశీనాథ్, ఎనగండ్ల  సర్పంచ్ వీరారెడ్డిలు  ఒకే గ్రామానికి చెందిన వారు కాగా, జెడ్పిటిసి  మేఘమాల సంతోష్ కుమార్, ఎంపీపీ మంజుల కాశినాథ్ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. అసలు ఇక్కడ నెలకొన్న అసమ్మతి కుల ఆధిపత్య పోరా?  అగ్ర నాయకుల గ్రూపుల లొల్లియా? అధిష్టానం దృష్టి సారించకుంటే గ్రూపుల  అసమ్మతి   మరింత తీవ్రస్థాయికి చేరే అవకాశాలున్నాయి.