ప్రజలంతా కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని 21, 34 , 19 వార్డుల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.అందత్వ రహిత తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు.పెద్ద ఆసుపత్రులకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకోలేని నిరుపేదలకు కంటి వెలుగు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో పట్టణంలోని అన్ని వార్డులలో కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రజలు కంటి పరీక్షలను నిర్లక్ష్యం చేయకుండా సరైన చికిత్సలు చేయించుకుని మందులు, అద్దాలు పొంది కంటి సమస్యలను దూరం చేసుకోవాలన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య మహిళ అనే కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ మొదలుపెట్టారని చెప్పారు.ప్రతి అర్బన్ సెంటర్లో ప్రతి మంగళవారం నిర్వహించడం జరుగుతుందని, ఎనిమిది రకాల చికిత్సలు చేయబడునని తెలిపారు.ప్రతి మహిళ ఆరోగ్య మహిళను వినియోగించుకోవాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, మున్సిపల్ కమిషనర్ రామంజుల రెడ్డి,కౌన్సిలర్లు పోలగాని కవిత బాలు గౌడ్, మేడిపల్లి విక్రమ్, సుంకరి అరుణ రమేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు సుంకరి రమేష్, ఢిల్లీ ఉపేందర్, తాహెర్, యాదగిరి, ఢిల్లీ పావని, రజని,మెప్మా అధికారి రమేష్ నాయక్, సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, జనార్దన్ రెడ్డి, ఎస్ఎస్ఆర్ ప్రసాద్, మెప్మా టిఎంసిలు శ్వేత, సువర్ణ, ఉమా,కంటి వెలుగు టీం తదితరులు పాల్గొన్నారు.
ప్రజలంతా కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి




