అనుమతులు లేకుండ రాత్రి అక్రమ మొరం దందా
జేసీబి టిప్పర్లను ఆపేసిన జనం
నిద్రమత్తులో అధికారులు
బిచ్కుంద జనవరి 13 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామంలో ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండానే రాత్రివేళ గత మూడు రోజులుగా అక్రమంగా మొరం దందాలు నడుపుతున్నారు. అయితే గురువారం రాత్రి గ్రామస్థులు అక్రమ మొరం రవాణా చేస్తున్న జేసీబి టిప్పర్లను ఆపేసి గ్రామంలోని చావడి వద్ద పెట్టించారు. ఇటీవల మండలకేంద్రంలో అక్రమంగా నడుపుతున్న ఇసుక వ్యాపారానికి యువకుడు బలి కాగా ఏమాత్రం కూడా చలనం లేకుండా అధికార యంత్రాంగం నిద్రమత్తులో ఉందని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. గతంలో అనేక ప్రమాద సంఘటనలు జరిగాయి. ఎన్ని సంఘటనలు జరిగిన ఎన్ని ప్రాణాలు గాలిలో కలిసిన అక్రమ ఇసుక, మొరం వ్యాపారస్తులకు ఏ మాత్రం జంకు, భయం లేకుండా అక్రమ దందా దర్జాగా నిర్వహిస్తున్నారు. వ్యాపారస్తులకు బడా నేతల అండదండలు ఉండడంతో మండలస్థాయి అధికారులను కూడా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. నువ్వు ఏమైనా చేసుకో మా వెనకాల చాలామంది ఉన్నారు, అంటూ ధీమాని వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా అక్రమ మొరం, ఇసుక దందా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
అనుమతులు లేకుండ రాత్రి అక్రమ మొరం దందా




