అబద్దాలు చెప్పేందుకే యాత్రలా ?


కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డిపై నారాయణ విమర్శలు
హైదరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై సీపీఐ జాతయ కార్యదర్శి నారాయణ సెటైర్లు విసిరారు. బీజేపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తూ జనాలను మోసం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. జన ఆశీర్వాద యాత్ర పేరుతో కేంద్రమంత్రి పచ్చి అబద్దాలు చెప్తున్నారన్నారు. ఇంకెంతకాలం ఇలా అబద్దాలతో బతుకుతారని అన్నారు. ప్రజలు గమనిస్తున్నారని గుర్తించాలన్నారు. పార్లమెంటులో ప్రధాని.. బయట కేంద్రమంత్రులు అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాలిబన్లు ఎంత ప్రమాదమో.. పెగాసెస్‌ అంతే ప్రమాదమన్నారు. నిఘా సంస్థలతో చేసుకున్న ఒప్పందాన్ని బయట పెట్టడానికి ప్రధాని మోదీ భయపడుతున్నారని తెలిపారు. మూడు రైతు చట్టాలను అమలు చేస్తే ప్రైవేట్‌ వ్యక్తులు బాగుపడతారని నారాయణ పేర్కొన్నారు. ఎన్నో సమస్యలపై ప్రజాందోళనలు చేస్తున్నా పట్టించుకోని కేంద్రం అబద్దాలతో కాలక్షేపం చేస్తోందన్నారు. మోడీని పొగడడానికే కేంద్రమంత్రులు యాత్రలు మొదలు పెట్టారని మండిపడ్డారు