నగరంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాల్సిందే


అప్రమత్తంగా ఉంటే థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశమే లేదు
నగరంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించిన సిఎస్‌
హైదరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): కరోనా థర్డ్‌ వేవ్‌ ఆలోచన కూడా రాకూదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్‌ వేయించుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. నగరంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ వేయాలన్న సంకల్పంతో ముందుకు పోతున్నామని అన్నారు. మూడో
ముప్పు రాదని, అయినా ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా థర్డ్‌ వేవ్‌ వస్తే ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో కరోనా ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైన్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా ఖైరతాబాద్‌ ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌లో వ్యాక్సినేషన్‌ను సీఎస్‌ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. నగరంలోని 4846 కాలనీల్లో టీకా తీసుకోని వారి గుర్తిస్తున్నామని చెప్పారు. జీహెచ్‌ఎంసీలోని ప్రతి కాలనీకి సంబంధించిన షెడ్యూల్‌ తయారు చేశామని తెలిపారు. వ్యాక్సినేషన్‌ పూర్తయిన ఇంటికి నీలిరంగు స్టిక్కర్‌ అతికిస్తున్నామని చెప్పారు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ వల్ల చాలా మంది టీకా వేయించుకోవాడికి వస్తున్నారని చెప్పారు. భయం వల్లే చాలా మంది టీకాకు దూరంగా ఉన్నారని చెప్పారు. వ్యాక్సినేషన్‌ పూర్తయిన కాలనీలకు పత్రాలతోపాటు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. 15 రోజుల్లో ప్రతి వ్యక్తికి ఒక డోసు టీకా పూర్తిచేస్తామన్నారు. నగరంలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ పూర్తయిన తర్వాత రాష్ట్రమంతటా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపడతమన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం చేయడంలేదన్నారు.