అభిమాని కుటుంబానికి పవన్‌ పరామర్శ

కన్నీటిని ఆపుకోలేక పోయిన జనసేనాని

కాకినాడ,జూన్‌8(జనం సాక్షి ): అభిమాని మృతిపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తల్లడిల్లిపోయారు. శోకసంధ్రంలో ఉన్న అభిమాని కుటుంబాన్నిచూసి కన్నీటి పర్యంతమయ్యారు. తునిలో విద్యుత్‌షాక్‌తో మృతిచెందిన.. కార్యకర్త నాగరాజు కుటుంబాన్ని పవన్‌ పరామర్శించారు. నాగరాజు ఆరునెలల బాబుకు ఆయన పేరు పెట్టారు. పాయకరావుపేటలో మంగళవారం అర్ధరాత్రి పవన్‌కల్యాణ్‌ అభిమానులు ప్లెక్సీలు కడుతుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు మృతిచెందారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా జనసేన అధినేత గురువారం పాయకరావుపేట వస్తున్నట్టు తెలుసుకున్న ఆయన అభిమానులు పట్టణంలోని సూర్యమహల్‌ సెంటర్‌లో ప్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా, వాటికి ఉన్న ఇనుప చట్రం, పైన వున్న విద్యుత్‌ తీగలకు తగిలింది. దీంతో భీమవరపు శివ (28), తోళెం నాగరాజు(30) విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. మరో ఇద్దరు ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఈఘటనపై తునివాలో నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో కన్నీటిని ఆపుకోలేక పోయారు. మరో అభిమాని భీమవరపు శివ(31) కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులను పవన్‌ కళ్యాణ్‌ పరామర్శించారు. శివ కుటంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేసి, ఆయన కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. కాగా, పవన్‌ చేస్తోన్న జన పోరాట యాత్ర కొనసాగుతోంది.