జనంసాక్షి , రామగిరి : అభివృధ్దిలో ముందుచూపుకు దిక్సూచిగా పన్నూరు గ్రామపంచాయతీ నిలుస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూర్ గ్రామంలో డీఎంఎఫ్టీ, గ్రామపంచాయతీ నిధులతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్లు, స్మశాన వాటిక, సెంట్రల్ లైటింగ్, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు పలు అభివృధ్ది పనులను గ్రామ సర్పంచ్ అల్లం పద్మ తిరుపతి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అభివృద్దిలో ముందు వరుసలో నిలుస్తున్న పన్నూరు గ్రామపంచాయతీని రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా అభివృధ్ది చేస్తామన్నారు. పక్కనే ఉన్న లద్నాపూర్, పన్నూర్లు కలిసి మంథని కంటే గొప్ప సిటీగా మారుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆనాడు పన్నూరు చుట్టుపక్కల భూములు తీసుకున్న సింగరేణి సంస్థ గ్రామానికి ఒక్క శాతం కూడా సాయం చేయలేదన్నారు. అయితే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణి సంస్థ ప్రజలకు ఎలా దగ్గర ఉండాలో ఎలాంటి అభివృధ్ది చేయాలో చూపించిన ఘనత తెలంగాణ సర్కార్,సీఎం కేసీఆర్‌దే అన్నారు. ఆనాడు పన్నూర్ పరిధిలోని భూములన్నీ సింగరేణి సంస్థకు చెందినవేనని, ఒక్క అడుగు ముందుకు వేయకుండా నిర్బంధం చేశారని, అలాంటి రోజుల నుంచి ఈనాడు అదే స్థలంలో గ్రామపంచాయతీ, ఆలయాలు నిర్మించుకున్నామని ఆయన తెలిపారు. గతంలో సింగరేణి నిధులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లేవని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ నిధులన్నీ స్థానికంగా కేటాయించేలా చేసి ఆ నిధులతో అభివృధ్ది చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రతి అభివృధ్దిపనిని సూక్ష్మంగా ఆలోచన చేసే బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పనిచేయడం మూలంగానే అభివృధ్ది చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్నామని ఆయన వివరించారు. చిన్న గ్రామ పంచాయతీల ఏర్పాటుతోనే అభివృధ్ది, పరిపాలన సౌలభ్యం సాధ్యమవుతుందని ఆనాడు సీఎం కేసీఆర్ గొప్పగా ఆలోచన చేశారని, ఆయన ఆలోచనల మేరకు సమిష్టి కృషితోనే అభివృధ్ది సాధ్యమైందన్నారు. పన్నూరు గ్రామంలో మిగిలిపోయిన పంక్షన్ హాల్ నిర్మాణంతో పాటు మిగతా అభివృద్ది పనులను సింగరేణి సంస్థ సహకారంతో పూర్తి చేస్తామన్నారు. పన్నూర్ అభివృద్దిలో బాగస్వాములై తర్వితగతిన పనులు పూర్తిచేసిన పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులను ఆయన అభినందించారు.




