Monday, 2 November 2026

రైతు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మనదేతడిసిన రంగుమారిన ధాన్యం కొనుగోలు చేయాలే – ధాన్యం సేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలే

 

 

 

 

 

–
జనంసాక్షి , మంథని : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునే రైతుకు నష్టం జరుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు.శనివారం జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మినారాయణతో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌తో కలిసి ఆయన సమావేశమై జిల్లాలో మొదలైన ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. యాసంగి పంట దిగుబడి వచ్చిన క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకువస్తున్నారని ఆయన జేసీకి తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. వాతావరణంలో మార్పులు వస్తున్నాయని, అకాల వర్షాలు కురుస్తున్న క్రమంలో కొనుగోళ్లను వేగవంతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇటీవలి కాలంలో కురిసిన అకాల వర్షాలతో అనేక కేంద్రాల్లో దాన్యం తడిసిందని, ఈ క్రమంలో రైతులు నష్టపోకుండా తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. రైతు పండించిన పంటలో ప్రతి గింజను కొనుగోలు చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ముఖ్యంగా మిల్లర్లు, హమాలీలతో సమస్యలు ఉత్పన్నమవుతాయని, సమస్యలు రాకముందే ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, రైస్‌ మిల్లర్లతో ముందుగానే మాట్లాడి సమస్యలు రాకుండా చూడాలని కోరారు. జిల్లాలో ప్రారంభమైన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణపై నిత్యం అధికారులు పర్యవేక్షణ చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై ఎలాంటి మచ్చ పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనదేనని ఆయన స్పష్టం చేశారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యంకు వెంటవెంటనే రైతులకు చెల్లింపులు జరిగేలా చూడాలని, చెల్లింపుల్లో జాప్యం చేయవద్దని ఆయన జేసీకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గంట రాములు, సింగిల్ విండో ఛైర్మెన్ కొత్త శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.