బెల్లంపల్లి, మార్చ్ 28, (జనంసాక్షి )
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై వస్తున్న ఆరోపణలను మంగళవారం బీఆరెస్ పార్టీ నాయకులు ఖండించారు. పట్టణంలోని పద్మశాలి భవన్ లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ శ్వేతా శ్రీధర్ మాట్లాడుతూ బెల్లంపల్లి ప్రజలకు ఏ రకంగా అయినా మంచి జరుగుతుంది అంటే, నలుగురు పేదలు బాగుపడుతారు అంటే, సామాన్యులకు ఉపాధి దొరుకుతుంది అంటే,ఈ మంచి ఉద్దేశ్యంతో ఎవరు వచ్చినా తోడ్పాటు అందించే మంచి గుణం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యది అన్నారు. ఏదైనా కార్యక్రమానికి ఎవరైనా మర్యాదపూర్వకంగా పిలిస్తేఅంతే మర్యాదపూర్వకంగా కార్యక్రమాలకు హాజరవుతారన్నారు. కానీ పాల డైరీ కి చెందిన ఆదినారాయణ, శైలజ రైతుల దగ్గర 11 లక్షల 80 వేల రూపాయలు మోసం విషయమై పోలీసు వారు ఆదినారాయణ టీం వారిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే రైతుల పక్షాన నిలబడతారని భయపడి ముందుగానే వ్యూహరచనతో ఎమ్మెల్యే పైన అపనిందలు వేస్తున్నారన్నారు. ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. 2012 సంవత్సరం నుండి ఆదినారాయణ టీం పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రంలో 22 కేసులు నమోదు అయ్యాయని, ఇక్కడ అంటే అక్కడ పాల డైరీలు ఓపెన్ చేయడం రైతుల దగ్గర లక్ష లక్షలు ఇన్సూరెన్స్ పేరుతో వసూలు చేయడం రైతుల దగ్గర ఖాళీ చెక్కులు తీసుకొని రైతుల మీద కేసులు వేయడం రైతులని బ్లాక్ మెయిల్ చేయడం కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జరిగిందన్నారు. పూర్తి ఆధారాలతో పత్రిక ముఖంగా చూపించడం జరిగిందన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎలాంటి సంబంధం లేదన్నారు. దళిత ఎమ్మెల్యే అని చులకన చూసి, అబండాలు వేస్తే చూస్తూ ఊరుకునేది లేదని దీని వెనుక ఎవరున్నా బయటికి తీస్తామని, దుర్గం చిన్నయ్యపై పత్రికల్లో, సోషల్ మీడియాలో అవాస్తవాలతో కూడిన దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసని, ఇకనైనా కొందరు రోతబుద్ధి మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, టిబిజికేఎస్ సెంట్రల్ కమిటీ సభ్యుడు గెల్లి రాజలింగు, బెల్లంపల్లి బీఆరెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ నూనేటి సదానందం, అధికార ప్రతినిధి కాసర్ల యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్స్, బిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిచేస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై వస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తున్నాం.




