Wednesday, 4 November 2026

అభివృద్ధిలో చరిత్ర సృష్టించిన‌ తెలంగాణ

హైదరాబాద్(జ‌నం సాక్షి ): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చరిత్ర అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇప్పుడు రాష్ట్ర పునర్‌నిర్మాణం మరో చరిత్ర అని పేర్కొన్నారు. ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టామని, బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధ్యమేనన్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ మాజీ నేత దానం నాగేందర్ టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. ఇసుక మాఫియా అంటూ విపక్షాలు అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ఇసుకపై రూ. 1675 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. రైతులకు 24 గంటల విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం తెలిపారు.అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందుందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణకు ఎన్నో అవార్డులు వచ్చాయని తెలిపారు. తెలంగాణలో అన్ని వర్గాలవారిని సమానంగా గౌరవిస్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 100 స్థానాల్లో గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావని జోష్యం చెప్పారు. 2020 జూన్‌ నాటికి ఎటుచూసినా ఆకుపచ్చ తెలంగాణే కనపడుతుందని అన్నారు. కాళేశ్వరం, సీతారామా, పాలమూరు ప్రాజెక్ట్‌లు పూర్తయితే… తెలంగాణలో రూ. లక్ష కోట్ల పంట పండుతుందన్నారు.